Hyderabad: హైదరాబాద్ లో నేరాలపై ఉన్నతాధికారులతో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. మొత్తం నేరాల తగ్గింపునకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.
Telangana home minister Mohammed Mahmood Ali: హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నేరాలపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయ చాంబర్లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్లతో హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ పోలీసింగ్ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందనీ, ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్ శాఖ అనేక పౌర కేంద్రీకృత, వినూత్న, సాంకేతిక కార్యక్రమాలను అమలు చేసి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందన్నారు.
ముఖ్యంగా హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై నేరాలు తదితర నేరాలను తగ్గించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లను ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందనీ, కాలనీలు, బస్తీలు, సున్నితమైన ప్రాంతాలు, జంక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామనీ, వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మహమూద్ అలీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ, రెచ్చగొట్టే సందేశాలు, వీడియోల వ్యాప్తిని అరికట్టాలనీ, నేరాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
క్రమం తప్పకుండా క్రైమ్ రివ్యూలు నిర్వహించాలనీ, క్రైమ్ పోకడలను నిశితంగా పరిశీలించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జిల్లాల పునర్విభజన తర్వాత సమర్థవంతమైన పోలీసింగ్ కోసం కొత్త కమిషనరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాలు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరించామన్నారు. సమర్థవంతమైన పోలీసింగ్, నేరాల నివారణ, దర్యాప్తు కోసం శాఖకు పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త జోన్లు, సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేటప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల పునర్విభజన కూడా చేసిందనీ, రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని అధికారులను మహమూద్ అలీ ఆదేశించారు.
ఇంటర్నెట్ వినియోగం పెరిగినందున సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.