మరోసారి తెరపైకి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

By Sumanth Kanukula  |  First Published Sep 7, 2023, 9:40 AM IST

తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. పసుపు బోర్డు అంశం నిజామాబాద్ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది.


తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. పసుపు బోర్డు అంశం నిజామాబాద్ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటకు సంబంధించిన హామీ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ధర్మపురి అరవింద్.. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్‌లో సంతకం చేసి హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడిచిన ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే నిజామాబాద్ ప్రాంతంలో స్పైస్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్రం గతంలోనే తెలిపింది. 

అయితే దీనిపై రైతుల నుంచి పెద్దగా హర్షం వ్యక్తం కాలేదు. నిజామాబాద్ రైతులు కూడా ఈ అంశంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హోర్డింగ్‌లు పెట్టి నిరసనలు తెలిపారు. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో అరవింద్‌పై పోటీ చేసి ఓడిన బీజేపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత.. ఎప్పటికప్పుడూ ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. అరవింద్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక, 2023 పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో, దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనేది లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్‌లో రాజకీయ వేడి నెలకొంది. 

Latest Videos

అయితే తాజాగా ఉత్తర తెలంగాణలో(నిజామాబాద్) పసుపు  బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రచారం తెరమీదకు వచ్చింది.  బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలోని పసుపు రైతుల దీర్ఘకాల డిమాండ్‌‌ను నెరవేర్చాలని యోచిస్తోందని బీజేపీ హైకమాండ్‌లోని వర్గాలు పేర్కొంటున్నట్టుగా సమాచారం. 

దేశంలోనే పసుపును అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో నిజామాబాద్‌ ఒకటి. అయితే 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటుపై ఇచ్చిన హామీని నెరవేర్చడం వల్ల రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతుందని పార్టీ అధిష్టానం లెక్కలు  వేసుకుంటున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. ఇక, ఈ వారం మొదట్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీపై ధర్మపురి అరవింద్ స్పందిస్తూ..  ‘‘నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ విజయానికి వ్యూహంపై విస్తృత చర్చలు జరిపాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించాము’’ అని పేర్కొన్నారు. 

అయితే అమిత్ షాతో అరవింద్ భేటీలో పసుపు బోర్డు అంశంపై కూడా చర్చ జరిగినట్టుగా ప్రచారం సాగుతుంది. త్వరలోనే పసుపు బోర్డు, ప్రాసెసింగ్ యూనిట్‌ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేయనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలలో ఎవరో ఒకరు నిజామాబాద్‌‌లో పర్యటించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. 

click me!