మీకు న‌చ్చితే నీతి.. న‌చ్చ‌క‌పోతే అవినీతా, అది నోరా, మోరీనా : కేంద్రంపై హరీశ్‌రావు ఫైర్

By Siva KodatiFirst Published Aug 18, 2022, 6:53 PM IST
Highlights

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటరిచ్చారు. మెచ్చుకున్న నోటితోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడారంటూ సెటైర్లు వేశారు. అది నోరా..? మోరీనా అని మంత్రి ప్రశ్నించారు.
 

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు కౌంటరిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మీకు నచ్చితేనేమో నీతి, నచ్చకపోతే అవినీతా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఇచ్చిందీ మీరే.. అవి కట్టేందుకు అప్పులు ఇచ్చిందీ మీరేనంటూ హరీశ్ చురకలు వేశారు. గతంలో ప్రధాని మోడీ కాళేశ్వరాన్ని ప్రశంసించిన వీడియోను మంత్రి ప్రదర్శించారు. 

గతంలో షెకావత్ కూడా కాళేశ్వరాన్ని మెచ్చుకోలేదా అని హరీశ్ రావు నిలదీశారు. మెచ్చుకున్న నోటితోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడారంటూ సెటైర్లు వేశారు. అది నోరా..? మోరీనా అని మంత్రి ప్రశ్నించారు. షెకావత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా కాళేశ్వరం సైట్‌‌లోనే ప్రాజెక్ట్‌ను ప్రశంసించారని మంత్రి గుర్తుచేశారు. ఇచ్చిన అప్పుల్ని బాగా సద్వినియోగం చేశారని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ అన్నారని హరీశ్ రావు వెల్లడించారు. 

ALso REad:జాతీయ జెండాల పంపిణీలో కేంద్రం విఫలం: మంత్రి హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని గడ్కరీ కూడా ప్రశంసించారని మంత్రి గుర్తుచేశారు. గోదావరి చరిత్రలోనే ఎన్నడూ లేనంత వరద ఈ ఏడాది వచ్చిందని.. 1986లో వచ్చిన వరద కంటే ఎక్కువ వరద వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. గోదావరి ఉప్పొంగి ప్రవహించడం వల్ల రెండు పంప్‌హౌస్‌ల్లోకి నీళ్లు వచ్చాయని... కానీ మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మొత్తం 21 పంప్‌హౌస్‌లు వుంటే రెండు పంప్‌హౌస్‌ల్లోకి మాత్రమే నీళ్లు వచ్చాయన్నారు. 

దెబ్బతిన్న 2 పంప్‌హౌస్‌ల్ని మరమ్మత్తు చేసే బాధ్యత ఏజెన్సీదేనని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నెల నుంచి నెలన్నర లోపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 100 శాతం రన్నింగ్‌లోకి వస్తుందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం నుంచి యాసంగి పంటకు నీళ్లిస్తామన్న ఆయన.. యాసంగిలో పండే పంటను కొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

click me!