ఈ నెల 21 మునుగోడులో బీజేపీ సభకు అమిత్ షా.. షెడ్యూల్ ఖరారు..

By Sumanth KanukulaFirst Published Aug 18, 2022, 5:32 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఈ నెల 21న తెలంగాణలో పర్యటించనున్నారు. మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా మునుగోడు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఈ నెల 21న తెలంగాణలో పర్యటించనున్నారు. మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా మునుగోడు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం (ఆగస్టు 21వ తేదీ) మధ్యామ్నం 3.30 గంలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో మునుగోడుకు చేరుకుంటారు. సాయంత్రం 4.30  గంటలకు మునుగోడు చేరుకోనున్న అమిత్ షా.. సీఆర్పీఎఫ్ అధికారులతో కొద్దిసేపు సమీక్ష జరపనున్నారు. అనంతరం మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు చేరుకుంటారు. దాదాపు గంట పాటు ఆయన బహిరంగ సభలో ఉంటారు. సభ వేదికపై అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీ కండువా కుప్పుకోనున్నారు. సభ వేదికగా తెలంగాణ బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. 

అనంతరం అమిత్ షా మునుగోడు నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. ఇక, మునుగోడు సభకు విచ్చేస్తున్న అమిత్ షా‌కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అమిత్ షా సభను విజయవంతం చేసేలా.. భారీగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది.  అమిత్ షా సభ కోసం వివేక్ వెంకటస్వామి, మనోహర్ రెడ్డి, ప్రదీప్ రావులతో బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. 

ఇక, మునుగోడు సభలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాడాలనేది పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ చెప్పారు. అదే సభలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు సభలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుందని ఆరోపించారు. ఇక, అమిత్ షా సభ తర్వాత మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ.. ముఖ్య నేతలతో కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

అమిత్ షా సభ నేపథ్యంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఒక్క రోజు విరామం ఇవ్వనున్నారు. దీంతో ఈ నెల 26 ముగియాల్సిన బండి సంజయ్ పాదయాత్ర.. ఒక్క రోజు ఆలస్యంగా ఈ నెల 27తో ముగియనుంది. 

click me!