
బడి పిల్లల బ్యాగుల మోత తగ్గించాలని తెలంగాణ విద్యాశాఖ పాఠశాలలకు సూచించింది. కిలోల కొద్ది మోతబరువును తగ్గించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేసింది. భారీ బరువు మోయడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది విద్యాశాఖ. పిల్లలు ఇప్పుడు మోస్తున్న బరువులో మూడో వంతు తగ్గించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రయివేటు పాఠశాలల తీరు పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు బరువు మోయలేక వారి ఆరోగ్యం పాడు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రయిమరీ పాఠశాలల విద్యార్థులు 6నుంచి 12 కిలోల బరువు మోపిస్తున్నాయి యాజమాన్యాలు. దీంతోపాటు అప్పర్ ప్రయిమరీ, హైస్కూల్ పిల్లలకు 12 నుంచి 17 కిలోల బరువు మోపిస్తున్నారు. కొన్ని పాఠశాలలు బహుళ అంతస్తుల్లో నిర్వహిస్తున్నారు. కిలోల కొద్ది బరువురు భుజాన వేసుకుని విద్యార్థులు మూడు, నాలుగు, ఐదు ఫోర్ల బిల్డింగ్స్ ఎక్కలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మోతబరువు కారణంగా పిల్లల్లో ఆరోగ్య సమస్యలతోపాటు ఎదుగుదల కూడా లోపిస్తున్నది. దీంతో విద్యాశాఖ పలు జిల్లాల్లో ఒక సర్వే చేపట్టింది. ఆ సర్వేలో కఠోరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో బడిపిల్లల మోతబరువును నియంత్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
విద్యాశాఖ ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
1,2 తరగతులకు ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలని అంతకంటే మించరాదని నిర్దేశించింది.
3,4,5 తరగతులకు పిల్లలకు 2నుంచి 3కిలోల బరువు కలిగిన స్కూల్ బ్యాగ్ మాత్రమే మోపించాలని సూచించింది.
6,7 తరగతులకు 4కిలోల బరువుకు మించరాదని ఆదేశించింది.
8,9 తరగతులకు నాలుగున్నర కిలోలకు మించేది లేదు.
10వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగ్ కేవలం 5కిలోల లోపే ఉండాలని మార్గదర్శకాల్లో సూచించింది.
పాఠశాలల్లో తప్పనిసరిగా సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని మార్గదర్శకాల్లో పొందుపరిచింది. ఇంటివద్ద నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి కల్పించరాదని సూచించింది.
ఇక 1,2 తరగతులకు మూడు టెక్ట్స్ పుస్తకాలు మాత్రమే వినియోగించాలని సూచించింది. అందులో మాతృభాష, ఇంగ్లీషు, గణితం పుస్తకాలు మాత్రమే సూచించింది.
3,4,5 తరగతులకు నాలుగు పుస్తకాలను సూచించింది. పైన వారితోపాటు అదనంగా ఎన్విరాన్ మెంటల్ సైన్స్ పుస్తకాన్ని జత చేయాలని కోరింది.
ఒకటి నుంచి 5వ తరగతి పిల్లలకు పాఠశాల సమయంలోనే చదివించడం, రాయించడం చేయాలని సూచించింది.
టీచర్ పర్యవేక్షణలో చదవు, రాయడం చేయాలి తప్ప హోంవర్కు ఇవ్వరాదని కోరింది.
సాయంత్రం వేళల్లో పిల్లలను తప్పనిసరిగా ఆటలు ఆడించే వెసులుబాటు కల్పించాలని సూచించింది.