
జనసేన పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎనలిస్టుల రిక్రూట్ మెంట్ పేరుతో బలగాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. జనసేన పార్టీని యువత, మేధావులను చేర్చుకోవడంలో ఆ పార్టీ బజీగా ఉంది.
ఇప్పటికే పలు జిల్లాల్లో ఎంపికలను ముంగించిన పార్టీ నాయకత్వం మిగిలిన జిల్లాలపై కన్నేసింది. మొత్తంగా తెలంగాణలో పార్టీని విస్తరించడానికి పావులు కదుపుతున్న నాయకత్వం, ఈ ఎంపికతో తమ లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించి పార్టీకి సేవలందించాలనుకునే ఔత్సాహికుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 20 న రంగారెడ్డిలో, 22 న మెదక్ జిల్లాలో ఎంపిక ప్రక్రియను చేసట్టనున్నారు.
కంటెంట్ రైటర్స్, అనలిస్టులు, స్పీకర్స్ విభాగాల్లో ఈ జిల్లా స్థానిక అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.
మొత్తానికి జనసేన విస్తరణ తెలంగాణలో ఎలాంటి పరిణామాలకు చోటు కల్పిస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.