
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని పాత సామెత ఉంది. అది ఈరోజుల్లో కూడా కొందరు రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తున్నది. తాజాగా ఎపిలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై హైకోర్టుకు ఒక జర్నలిస్టు వెళ్లారు. దీంతో కోర్టు కేసును స్వీకరించింది. అయితే ఆ కేసును తెలంగాణలో పార్టీ ఫిరాయించి మంత్రి పదవి చేపట్టిన తలసాని కేసుతో కలిపి విచారణ చేస్తామని హైకోర్టు వెల్లడించింది. దీంతో తలసాని కేసులో మళ్లీ కదలికలు వచ్చాయి. ఈ పరిణామాలపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.
తెలంగాణలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి గెలుపొందారు తలసాని శ్రీనివాస యాదవ్. కానీ ఆయన అనతి కాలంలోనే టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి నుంచి గెలిచినప్పటికీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించి ఆమోదించకముందే టిఆర్ఎస్ పార్టీలో చేరడం, మంత్రివర్గంలో బెర్తు సంపాదించడం చకచకా జరిగిపోయాయి.
అయితే ఆయన పార్టీ ఫిరాయించడం, ప్రత్యర్థి పార్టీ నుంచి మంత్రివర్గంలో చేరడాన్ని అప్పట్లో టిడిపి హైకోర్టులో కేసు వేసింది. దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించకపోవడంతో టిడిపి హైకోర్టు మెట్లెక్కింది. ప్రస్తుతం ఆ కేసు ఇంకా కోర్టులోనే నలుగుతోంది. అయితే అనంతర కాలంలో తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యేలంతా వరుసబెట్టి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే టిడిపికి మిగిలారు. టిడిపి శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరడంతో తమ పార్టీని విలీనం చేయాలని స్పీకర్ కు ఎర్రబెల్లి లేఖ అందజేశారు. స్పీకర్ వారిని టిఆర్ఎస్ సభ్యుల జాబితాలో చేర్చారు.
కానీ కోర్టులో మాత్రం కేసు ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఎపిలో పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టిన నలుగురు వైసిపి సభ్యులపై ఒక జర్నలిస్టు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు కేసును స్వీకరించి తెలంగాణ మంత్రి తలసాని కేసుతో కలిపి విచారణ చేస్తామని ప్రకటించింది. దీంతో మరోసారి తలసాని పార్టీ ఫిరాయింపు వ్యవహారం చర్చనీయాంశమైంది.