
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరోసారి తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రానున్న కాలంలో సామాజిక తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా రాజకీయ పార్టీ ఏర్పడాలని ఆకాంక్షించారు.
త్యాగాల తెలంగాణ సాధన కోసం మహాజన సమాజం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన సుందరయ్య కళా విజ్ఞాన్ భవన్‌లో జరిగిన మహా జన సమాజం సదస్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రాష్ట్ర రాజకీయాలపై , తమ భవిష్యత్తు కార్యాచరణపై వివరణ ఇచ్చారు.
ఇప్పటి వరకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో చర్చించలేదని అయితే పార్టీ ని ఏర్పాటు చేయడమా లేక ఉద్యమ సంఘంగా కొనసాగడమా అనేది త్వరలోనే తేలుతుందన్నారు.
అయితే దీనికంటే ముందే త్వరలో జిల్లాల వారీగా కార్యక్రమాలు చేపడుతామని, ఆరు నెలల తర్వాత భువనగిరిలో సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభ దాదాపు 10 లక్షల మంది హాజరయ్యేలా చూస్తామన్నారు.
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో జతకట్టే విషయంపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ పవన్ తో కలిసి పనిచేశే విషయంపై భవిష్యత్తులో ప్రకటిస్తానని తెలిపారు.