
హైదరాబాద్: హోలీ పండుగ అంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎటు చూసిన రంగులే కనిపిస్తాయి. మధ్యాహ్నం వరకు చిన్నా పెద్దా అందరూ రంగుల్లో మునిగి తేలుతారు. కానీ, తెలంగాణలోని ఆ గ్రామంలో మాత్రం హోలీనాడు రక్తం పారాల్సిందే. ఒకరి రక్తం మరొకరు కళ్లజూసుకుంటారు. ఆ రక్తాన్ని కాముని బూడిదతో తుడ్చేసుకుంటారు. ఆ తర్వాత అంతా భాయి భాయీ అంటూ కలిసి కదులుతారు. ఈ విచిత్ర ఆచారం నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో ఉన్నది.
ఇక్కడ ప్రతియేటా హోలీ వచ్చిందంటే కచ్చితంగా ఆ రోజు పిడిగుద్దుల పండుగ జరుపుకుంటారు. ఈ ఆచారం అక్కడ సుమారు వందేళ్ల నుంచి వస్తున్నదని పెద్దలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం కూడా ఇతర గ్రామాల్లో హోలీ వేడుకలు రంగులతో జరిగితే.. ఇక్కడ అందుకు అదనంగా పిడిగుద్దుల పండుగ కూడా చేసుకున్నారు.
ఆ ఊరిలో మంగళవారం ప్రజలు హోలీ ఆడుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం హనుమాన్ ఆలయం ఎదురుగా పిడిగుద్దులు గుద్దడానికి, స్వీకరించడానికి సిద్ధమైపోయారు. ఒక తాడు కట్టి జనం రెండుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రక్తం వచ్చిన చోట కామదహనం తర్వాత ఏర్పడ్డ బూడిదతో తుడిచేసుకున్నారు. ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ ఆట సాగుతుంది.
Also Read: బీజేపీ కక్ష సాధింపు చర్యలు.. కేసీఆర్ పై కుట్రలో భాగంగానే..: కవితకు ఈడీ నోటీసుల పై మంత్రుల రియాక్షన్
మంగళవారం ఈ పిడిగుద్దులు విసురుకోవడం ముగియగానే వెంటనే పరస్పరం ఆలింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు జరిగాయి.
గాయాలు అవుతున్నా సరే గ్రామస్తులు మాత్రం పిడిగుద్దుల కార్యక్రమం నిర్వహించక మానరు. ఎందుకంటే.. పిడిగుద్దుల కార్యక్రమం నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టం అని స్థానికులు భావిస్తారు. ఈ కార్యక్రమం కోసం ఊరి నుంచి సుదూరాలకు వలస వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి పండుగ మొత్తాన్ని ఆసక్తిగా చూస్తు ఉంటారు.