
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఓ రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది. సుమారు రూ.2 కోట్ల విలువైన యంత్రాలు దహనం అయ్యాయి. అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యం దగ్ధం అయ్యింది.
మా సమస్యలు పరిష్కారమైతేనే ఆసియా క్రీడల్లో పాల్గొంటాం - రెజ్లర్ సాక్షి మాలిక్
వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం భూక్యారాంతండా గ్రామంలో మహాదేవ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఓ రైస్ మిల్లు కొనసాగుతోంది. అందులో శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం వరకు ఉండి, తరువాత ఇంటికి వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం హమాలీ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. వీరు బస్తాలు లోడ్ చేసేందుకు ఉదయం 5 గంటలకు రైస్ మిల్ వద్దకు వచ్చారు. అయితే లోపలి నుంచి పొగలు రావడాన్ని వారు గమనించారు. వెంటనే రైస్ మిల్ ఓనర్ కు, ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
దీంతో మహబూబాబాద్, మరిపెడ, వరంగల్ ప్రాంతాల్లో ఉన్న ఫైర్ ఇంజన్లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. రైస్ మిల్లు వెనకాల నుంచి ఓ గోడను సిబ్బంది తొలగించారు. దాని ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగింది. 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యం దహనం అయ్యాయి. అలాగే పది వేల గన్ని సంచులు, సుమారు రూ.2 కోట్ల విలువైన మిషిన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన తరువాత మిగిలిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న మరో రైస్ మిల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనా స్థలాన్ని అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సీఐతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా.. గత నెల 30వ తేదీన హైదరాబాద్‌లో కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఎల్‌బీ నగర్‌లోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్‌మెంట్లు, పాత కార్ల షోరూమ్ వున్నాయి. చూస్తుండగానే టింబర్ డిపో పక్కనే వున్న పాత కార్ల షోరూమ్‌కి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. అయితే కార్ల షోరూమ్‌లో సిలిండర్లు వుండటంతో భారీగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ పక్కనే వున్న కారు మెన్ కారు గ్యారేజ్ వరకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను అధికారులు ఖాళీ చేయించారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.