
తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్ కనిపిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీ.. ఆ తర్వాత నుంచి తెలంగాణలో కూడా గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బహిషృత నేతలు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో త్వరలో దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే దామోదర్ రెడ్డి.. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి తన కుమారుడు రాజేష్‌కు టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఉండటంతో.. ఆ విషయంపైనే మల్లు రవితో చర్చలు జరిపినట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. జూపల్లి కృష్ణరావు పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత జగదీశ్వరరావులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక, రాష్ట్రంలోని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తాజా రాజకీయ అంశాలపై వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. రెండు గంటలకు పైగా ఈ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్‌లో చేరితే.. కొల్లాపూర్ పార్టీ కోసం ఇంతకాలం పనిచేసి టికెట్ ఆశిస్తున్న నేతలతో కలిసి ముందుకు సాగాలనే భావనలో జూపల్లి కృష్ణారావు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, తాను ఏ పార్టీలో చేరేది జూన్‌లో ప్రకటించనున్నట్టుగా జూపల్లి ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.