
తెలంగాణ కాంగ్రెస్‌లో పైకి అంతా బాగున్నట్లుగా కనిపిస్తున్నా అదంతా మేడిపండు చందమే అన్నట్లుగా వుంది. ఇటీవల మండల కమిటీలు, డీసీసీ అధ్యక్షుల వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గీయులు ఆదివారం గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత లభించడం లేదని, ఏ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదని ప్రభాకర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోకపోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరోవైపు .. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి మాణిక్‌రావ్ థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీ హనుమంతరావుతో పాటు వ్యూహకర్త సునీల్ కనుగోలు హాజరయ్యారు. త్వరలో జరగనున్న ప్రియాంక గాంధీ సభ, బీసీ డిక్లరేషన్ , పార్టీ కమిటీలపై నేతలు చర్చిస్తున్నారు.
ALso Read: గాంధీ భవన్ మెట్లెక్కి ధర్నాలు చేస్తే ఊరుకునేది లేదు : కేడర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్
కాగా.. ఇటీవల సొంత పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట గాంధీ భవన్‌లో ఆందోళనలు చేస్తే తీవ్ర చర్యలు వుంటాయని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రేవంత్ సిఫారసు చేశారు. అలాగే నియామకాల విషయంలో ఏదైనా అభ్యంతరాలు వుంటే పెద్దల దృష్టికి రావాలని, అంతేకానీ గాంధీ భవన్‌లో ధర్నాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.