టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రవీణ్, రాజశేఖఱ్ రెడ్డిని విచారించనుంది. మరో వైపు శంకరలక్ష్మి, సత్యనారాయణలకు నోటీసులు పంపింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీక్ లో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తుంది. ఈ విషయమై ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోర్టు అనుమతి కోసం నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మరో వైపు టీఎస్‌పీఎస్‌సీ కాన్పిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి,తో పాటు సత్యనారాయణలను విచారించాలని ఈడీ భావిస్తుంది. ఈ మేరకు వీరిద్దరికి ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల15, 16 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసును సిట్ విచారిస్తుంది. ఈ విషయమై ఈడీ అధికారులు సిట్ నుండి వివరాలు సేకరించనున్నారు. ఈ ఏడాది మార్చి 12, 15, 16 తేదీల్లో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించాల్సిన రెండు పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లను హ్యాక్ చేశారనే అనుమానంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకం, టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షలను తొలుత అధికారులు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై విచారణ నిర్వహించిన పోలీసులు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అయిందని గుర్తించారు. ఈ ఏడాది మార్చి 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షల పేపర్ లీకౌందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణకు ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ .
also read:ప్రశ్నాపత్రం లీక్: టీఎస్‌పీఎస్‌సీ వద్ద బీజేవైఎం ఆందోళన, ఉద్రిక్తత
పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ , ఢాక్యానాయక్ , రేణుకలతో పాటు 17 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఏఈ, గ్రూప్-1 ప్రిలిమ్స్ , డీఏవో ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్ లు లీక్ చేశారు. ప్రవీణ్, రాజశేఖర్ , రేణుకలు ఉపయోగించిన సెల్ ఫోన్లను సిట్ బృందం ఎఫ్ఎస్‌ఎల్ కు పంపింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇటీవలనే సిట్ కు చేరింది. ఈ నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనున్నారు పోలీసులు .నిందితులు ఉపయోగించిన పెన్ డ్రైవ్, మొబైల్స్ లో క్వశ్చన్ పేపర్లు ఉన్నట్టుగా ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక తేల్చింది.