ఓ పదిరోజుల చిన్నారి ముక్కును వైద్యులు తొలగించడంతో ఆస్పత్రి ఎదుట చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ నారాయణ గూడలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : ఓ నవజాత శిశువుకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పిన వైద్యులు చికిత్సలో భాగంగా ఆ శిశువుకు ముక్కు లేకుండా చేశారు. దీంతో లేక లేక పుట్టిన చిన్నారి పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిమీద వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన సిబ్బంది చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో శుక్రవారం నాడు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన హైదరాబాదులోని నారాయణగూడలో వెలుగు చూసింది.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే.. పాతబస్తీ కాలా పత్తర్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్, హర్షన్నుస్సా ఖాన్ దంపతులు. వీరికి 13 ఏళ్ల క్రింద వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. 13యేళ్ల తరువాత ఇటీవల హర్షన్నుసా గర్భం దాల్చింది. జూన్ 8వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది హర్షన్నుస్సా ఖాన్. దీనికోసం హైదర్గూడా లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో చేరారు. పుట్టిన బిడ్డకు ఫతే ఖాన్ అనే పేరు కూడా పెట్టుకున్నారు.
అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
అయితే, పుట్టిన వెంటనే శిశువు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గమనించిన వైద్యులు వెంటనే ఎన్ఐసీయూలోకి మార్చారు. అప్పటి నుంచి శిశువు ఎన్ఐసియూ లోనే ఉంది. ఆ తర్వాత పది రోజులకు తల్లిదండ్రులకు వైద్యులు బిడ్డను చూపించారు. ఆ సమయంలో బిడ్డ ముక్కు నల్లగా ఉంది. అదే విషయాన్ని తల్లిదండ్రులు వైద్యుల్ని ప్రశ్నించారు. చికిత్సలో భాగంగా చిన్నారికి ఆక్సిజన్ పెట్టామని.. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు.
ముక్కు నలుపు పోవడానికి.. 18 వేల రూపాయల విలువైన ఆయింట్మెంట్ పెట్టాలని తల్లిదండ్రులతో తెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్ఐసియూలో పెట్టారు… మరోసారి బిడ్డను చూపించిన సమయంలో.. మొదట చూపించినప్పుడు ఉన్న నల్లటి భాగం ఊడిపోయి ఉంది. దీంతో ఏం జరిగిందంటూ వైద్యులను ప్రశ్నించారు. దీనికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తండ్రి వాపోయాడు. ఆస్పత్రి బిల్లు రోజుకు రూ. 35000 చొప్పున వసూలు చేస్తున్నారని ఇప్పటివరకు తాము రూ. 5 లక్షల వరకు బిల్లు కట్టామని.. అదంతా అప్పు చేసి తీసుకొచ్చామని బోరున విలపిస్తున్నారు.
బిడ్డకు జ్వరం వచ్చి ముక్కులోంచి నీరు కారుతోందని.. ఆ సమయంలో ఓ పుల్లకి దూది పెట్టి ఆ నీటిని శుభ్రం చేయడం చూస్తుంటే తమకు కన్నీళ్లు ఆగడం లేదని వాపోయారు. ఇంత దారుణానికి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ సాయికిరణ్ ఆయన వైద్య బృందమే కారణమంటూ వారు పోలీసులు ఆశ్రయించారు. ఈ కేసు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ఆస్పత్రి వర్గాలు దీని మీద మాట్లాడుతూ.. బాబుకి ఇన్ ఫెక్షన్ సోకిందని తెలిపారు. చిన్నారికి ఏడాది వయసు వచ్చిన తర్వాత ముక్కును సరి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఇక పూర్తి స్థాయిలో ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే 10 సంవత్సరాల తర్వాతే వీలవుతుందన్నారు. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.