ఢిల్లీ ఆర్డినెన్స్ వివాదం.. విపక్షాలు ఏకమైతే బిల్లు పాసవ్వదు, కేసీఆర్ అండగా వుంటామన్నారు : కేజ్రీవాల్

By Siva KodatiFirst Published May 27, 2023, 3:51 PM IST
Highlights

ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చాక ఢిల్లీ సీఎం అధికారాలను లాక్కున్నారని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రాజ్యసభలో బీజేపీకి బలం లేదని.. విపక్షాలు ఏకమైతే బిల్లు పాసవ్వదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

కేంద్రం తీరు వల్ల ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. శనివారం ప్రగతి భవన్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, మాట్లాడుతూ .. కొన్ని శాఖల కార్యదర్శులను సైతం బదిలీ చేసే పరిస్థితి లేదని కేజ్రీవాల్ తెలిపారు. సుప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా ప్రధాని మోడీ ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. 

ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానకరమని.. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మద్ధతుతో తమకు అండ పెరిగిందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని.. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ తీరుతో దేశం ప్రమాదకరస్థితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2015లో తాము అధికారంలోకి వచ్చిన 3 నెలలకు మా నుంచి కేంద్రం అధికారాలు లాక్కుందని కేజ్రీవాల్ తెలిపారు. 

ALso Read: కేసీఆర్‌తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ.. మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రెస్ మీట్..!!

గతంలో షీలా దీక్షిత్ సీఎంగా వున్నప్పుడు ఆమెకు అన్ని అధికారాలు వున్నాయని ఆయన వెల్లడించారు. మోడీ వచ్చాక ఆ అధికారాలన్నీ పోయాయని.. అయితే 8 ఏళ్లు పోరాటం చేశామని, చివరికి సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. కానీ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను పక్కనబెడుతూ మోడీ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో బీజేపీకి బలం లేదని.. విపక్షాలు ఏకమైతే బిల్లు పాసవ్వదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆర్ధినెన్స్‌ను ప్రధాని మోడీ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాన్ని మోడీ ఎటు తీసుకెళ్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 

click me!