రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరుతో సైబర్ మోసగాళ్లు ఉద్యోగుల నుండి డబ్బులు కొట్టేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులతో సీఎస్ పేరుతో కేటుగాళ్లు చాటింగ్ చేశారు.
కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో కామారెడ్డిలోని కలెక్టరేట్ ఉద్యోగులతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో చాటింగ్ చేశారు. అంతేకాదు డబ్బులు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు కోరారు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను పంపారు. మరికొందరు ఉద్యోగులు మాత్రం అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొలుత ఉద్యోగుల క్షేమ సమాచారం గురించి తెలుసుకుంటూ మీ చిట్టా నా వద్ద ఉందని సీఎస్ పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించారు. తనకు నగదు కావాలని ఉద్యోగులను కోరారు. సీఎస్ స్థాయి అధికారి తమను ఎందుకు డబ్బులు అడుగుతారని అనుమానించిన కొందరు ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అయితే డిప్యూటీ తహసీల్దార్ ఒకరు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ. 2 లక్షలు పంపారు. బాధిత ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు.
also read:బాబాయ్ అంటూ బంధుత్వం కలిపి చీటింగ్... పెనమలూరులో కొత్తరకం మోసం
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు అందినకాడిని దోచుకుంటున్నారు. వ్యాపారులు, నిరుద్యోగుల నుండి నమ్మించి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదయ్యాయి.సైబర్ మోసాలపై పోలీసులు ముందుజాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ జాగ్రత్తలను పట్టించుకోకపోవడంతో మోసాలకు గురయ్యేవారు ఎక్కువగా ఉంటున్నారు.