
ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బిజెపిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతల నుండి బండి సంజయ్ ను తప్పించి బిజెపి పెద్దలు కిషన్ రెడ్డికి అప్పగించారు. దీంతో సంజయ్ ను అభిమానించే బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ వీరాభిమాని ఒకరు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ ఎంపీ బండి సంజయ్ కు వీరాభిమాని. అయితే తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సంజయ్ నాయకత్వంలోనే బరిలోకి దిగుతుందని అతడు భావించాడు. సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకే తెలంగాణ బిజెపి బాగా బలపడింది కాబట్టి అధ్యక్ష మార్పు ప్రచారాన్ని నమ్మలేదు. కానీ నిన్న(మంగళవారం) బిజెపి జాతీయాధ్యక్షుడితో బేటీ అనంతరం సంజయ్ రాజీనామా చేయడం... ఆ వెంటనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన వెలువడింది. దీంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
సంజయ్ అన్నను అధ్యక్ష పదవినుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నానంటూ సహచర బిజెపి నాయకులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసాడు శ్రీనివాస్. ఈ క్రమంలోనే తీవ్ర డిప్రెషన్ కు గురయిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకోగా కుటుంబసభ్యులు గమనించారు. వెంటనే అతడిని కిందకుదింపి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే వుందని చికిత్స అందిస్తున్న డాక్టర్లు చెబుతున్నారు.
తన ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుపుతూ శ్రీనివాస్ రాసిన సూసైడ్ లెటర్ ను కుటుంబసభ్యులు గుర్తించారు. బండి సంజయ్ అన్నను రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుండి తొలగించడం ఎంతో బాధించిందని... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రీనివాస్ ఆ లేఖలో పేర్కొన్నాడు. తనకు ఎవరిపైనా కోపం లేదు... సంజయ్ అన్నపై ప్రేమతో మాత్రమే వుందన్నాడు. అందుకే ఆయనను తొలగించడంతో మనస్తాపానికి గురయినట్లు సూసైడ్ లెటర్ లో ఖమ్మం బిజెపి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నాడు.
ఇదిలావుంటే కేంద్ర బిజెపి నిర్ణయంతో కలతచెందిన నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్ రావు కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్‌కు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్ తన కుటుంబాన్ని, ప్రాణాన్నీ లెక్క చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లారని, అధికారపార్టీకి ఒక బలమైన ప్రత్యర్థ పార్టీగా బీజేపీని నిలిపారని నాగేశ్వర్ రావు ఆ లేఖలో తెలిపారు. కొందరు ఆయన ఇంటిపై రాళ్లు రువ్వినా, తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించినా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్లాడని, పార్టీ కార్యకర్తల్లోనూ ధైర్యాన్ని నింపాడని పేర్కొన్నారు. అలాంటి నాయకుడు రాజీనామా చేయడం తనను కలచివేసిందని, అందుకు నిరసనగా తానూ రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.