
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పాతూరుకు చెందిన 30 ఏళ్ల మహిళ దగ్గు, ఆయాసం, ఒళ్లు నొప్పులతో జిల్లా ఆస్పత్రికి రావడంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు పాజిటివ్ తేలడంతో హాస్పటల్ వార్డులో చేరాలని సూచించారు. అయితే ఆమె నిరాకరించడంతో హోమ్ ఐసొలేషన్‌కు పంపించారు.
తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రణ కోసం జిల్లావారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కోవిడ్ ఇప్పుడు ఎండ్‌మిక్ స్టేజ్‌కు చేరిందని, తక్కువ లక్షణాలతో వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.
జూన్ 3, 2025 నాటికి దేశవ్యాప్తంగా 4,026 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1,416 కేసులు ఉండగా, ఢిల్లీ (393), పశ్చిమ బెంగాల్ (372), మహారాష్ట్ర (494)లో కూడా గణనీయంగా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఐదుగురు మరణించడంతో ఆందోళన నెలకొంది.
JN.1 వంటి సబ్ వేరియంట్ల ప్రభావంతో జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. అయినా గతంలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్లు అధికంగా వ్యాప్తి చెందేలా లేవని పరిశోధనలో తేలింది. అయినా ప్రజలు శానిటేషన్, మాస్క్‌లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని వైద్యశాఖలు కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు భయాందోళనకు గురికాకుండా, ప్రభుత్వం తెలిపే మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.