నిజాం నిధుల కోసమే.. సచివాలయ కూల్చివేత: అర్థరాత్రి తవ్వకాలేందుకంటూ రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 14, 2020, 8:04 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇది అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇది అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సుదీర్ఘ భేటీ నిర్వహించిన కేసీఆర్ హుటాహుటిన వారితో మాత్రమే దీని గురించి చర్చించి సచివాలయం కూల్చివేతను మొదలుపెట్టారని రేవంత్ ధ్వజమెత్తారు.

సెక్రటేరియేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర కఠిన నిషేధాజ్ఞలు విధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన ఆయన.. సచివాలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ వుందని, పక్కన రోడ్లపై వాహనాలను అనుమతించినా జరిగే నష్టం ఏం ఉండబోదని రేవంత్ అన్నారు.

Also Read:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు మరోసారి హైకోర్టు బ్రేక్: ఈ నెల 15 వరకు పనుల నిలిపివేత

సెక్రటేరియేట్ కూలగొట్టేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వచ్చిన  రోజు నుంచి మళ్లీ స్టే విధించడం వరకు 11 రోజుల పాటు కేసీఆర్ ఎక్కడికి వెళ్లాలని ఆయన  ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కనిపించకుండా ఉన్న ఈ కాలంలో ఆయన కార్యాచరణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని రేవంత్ డిమాండ్ చేశారు.

సచివాలయ కూల్చివేత రహస్యమైనదా..? అర్థరాత్రి ఎందుకు కూల్చివేత మొదలుపెట్టారన్న ఆయన.. ఇతర సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించి వారి పర్యవేక్షణలో కూల్చివేత జరగాలని రేవంత్ సూచించారు.

మంచి కార్యక్రమాలు ఎవరైనా పగలే చేస్తారు. దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పగటి సమయంలోనే జరుగుతుందని.. కానీ గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. పోఖ్రాన్ అణు పరీక్షలు కూడా ఇంత రహస్యంగా జరపలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

సచివాలయం కూల్చివేత సమయంలో ఎవ్వరినీ సెల్‌ఫోన్లు తీసుకెళ్లనివ్వలేదని.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారని వెంటనే వారిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ పరిణామాలను బట్టి తాము పరిశోధన చేయగా.. నిజాం నిధుల విషయం వెలుగులోకి వచ్చిందని.. దీని గురించి కేసీఆర్ పత్రికతో పాటు జాతీయ పత్రికలు సైతం గతంలో రాశాయని రేవంత్ పాత పేపర్ కటింగ్‌లను చూపించారు.

Also Read:కొత్త సచివాలయంలో మసీదు, హజ్‌హౌస్... డిజైన్‌‌ ఎంఐఏందా : కేసీఆర్‌పై రాజాసింగ్

హోంసైన్స్ కాలేజీ నుంచి మింట్ కాంపౌండ్, విద్యారణ్య పాఠశాల, జీబ్లాక్, సైఫాబాద్ ప్యాలెస్‌లకు ఉన్న సొరంగాల్లో గుప్త నిధులు ఉండే అవకాశం ఉందని అధికారుల నివేదిక ఇచ్చారని కూల్చివేతల కంటే ముందు రాష్ట్రం ఈ సాంకేతిక నిపుణులతో పూర్తిగా విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

గుప్తనిధుల అంశాన్ని సుమోటాగా తీసుకొని తక్షణం విచారణ కమిటీ వేయాలని బాధ్యత గల ఎంపీగా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నా అని రేవంత్ విజ్ఙప్తి చేశారు. 
 

click me!