అన్న కేసీఆర్ వేరు, సీఎం కేసీఆర్ వేరే: విజయశాంతి

By narsimha lodeFirst Published Oct 8, 2018, 12:44 PM IST
Highlights

ఉద్యమంలో ఉన్న  తన సోదరుడు కేసీఆర్‌కు... సీఎంగా ఉన్న కేసీఆర్‌కు చాలా వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: ఉద్యమంలో ఉన్న  తన సోదరుడు కేసీఆర్‌కు... సీఎంగా ఉన్న కేసీఆర్‌కు చాలా వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై తనకు వ్యక్తిగతంగా కోపం లేదన్నారు. పార్టీలో ఉన్న సమయంలో  తనను  కేసీఆర్ గౌరవించాడని.. తాను కూడ అదే గౌరవాన్ని కేసీఆర్‌కు ఇచ్చినట్టు విజయశాంతి చెప్పారు.

ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆమె పలు విషయాలపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను కూడ  కేసీఆర్‌తో కలిసి పనిచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఉద్యమ సమయంలో  తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.తన పార్టీని వీలీనం చేయాలని  చాలా ఒత్తిడి వచ్చిందన్నారు.  దరిమిలా తాను కూడ  తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసినట్టు చెప్పారు.

టీఆర్ఎస్‌లో  తనను కేసీఆర్ గౌరవించారని ఆమె గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో తన పట్ల కేసీఆర్ ఆప్యాయంగా ఉండేవారన్నారు. కానీ, రాను రాను తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని గుర్తు చేసుకొన్నారు.

తాను పార్టీని విలీనం చేసే సమయంలోనే  తనకు  ఒక అనుమానం ఉందన్నారు. తనను ఎప్పుడో పార్టీ నుండి బయటకు పంపేస్తారని చాలా మంది అన్నారని... మధ్యలో  కొంత మనసు పొరల్లో  అప్పుడప్పుడూ ఆ అనుమానం తొలిచేదన్నారు.  అయితే   2013లో తనను పార్టీ నుండి  సస్పెండ్ చేశారని  విజయశాంతి చెప్పారు. తనను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించినా కూడ కేసీఆర్ సరైన సమాధానం చెప్పలేదన్నారు.

పార్టీలో తాను నెంబర్ 2గా కొనసాగినట్టు ఆమె చెప్పారు. అయితే ఈ స్థానాన్ని తన కుటుంబసభ్యులతో  భర్తీ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే  కేసీఆర్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉంటారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే కేసీఆర్‌ను బతిమిలాడుతానని  అనుకొన్నారేమో... కానీ, తనకు ఆ అవసరం లేదన్నారు.

  తనను టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినా కూడ  ఏ పార్టీలో చేరలేదన్నారు.  2014లో  పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసైన రెండు మూడు రోజుల తర్వాత తాను  కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆమె చెప్పారు.

కేసీఆర్ చెప్పేదోకటి... చేసేదొకటి ఉంటుందని విజయశాంతి  అభిప్రాయపడ్డారు. దళితుడిని తెలంగాణకు సీఎం చేస్తానని ఇచ్చిన మాటను కేసీఆర్ అమలు చేయలేదన్నారు. నాలుగేళ్ల పాటు సీఎం కేసీఆర్ ఏం చేస్తాడోనని వెయిట్ చేసి.... ఇంతవరకు  ఏం మాట్లాడలేదన్నారు.  కానీ, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడ  స్వంత ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

తాను కేసీఆర్ ఒకే  కోవకు చెందినవాళ్లం... కేసీఆర్‌ను ఎలా ఢీకొట్టాలని తాను వ్యూహరచన చేస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్, కవిత, హరీష్ రావులు చిన్నపిల్లలన్నారు. వాళ్తతో తనను పోల్చకూడదని విజయశాంతి చెప్పారు.

త్వరలో జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపోతాడనే భయం పట్టుకొందని  విజయశాంతి అభిప్రాయపడ్డారు.  ఈ విషయమై  కేసీఆర్  ప్రసంగాలను చూస్తే అర్థమౌతోందన్నారు. ఓటమి భయం కారణంగానే  కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కారణంగా  టీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్‌కు భయం పట్టుకొందన్నారు. ఈ కారణంగానే మహాకూటమిపై  కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని  విజయశాంతి అభిప్రాయపడ్డారు. 

కేసీఆర్ అహంకారంతో కూడిన దొర... అందుకే ఓసేయ్ రాములమ్మ సినిమాలో రాంరెడ్డి పాత్రతో కేసీఆర్‌ను పోల్చినట్టు  ఆమె తెలిపారు. తాను రాజకీయపరంగా కేసీఆర్‌తో విబేధించినా.... ఏనాడూ కూడ అసభ్యకరంగా ఆయనపై మాట్లాడలేదన్నారు. తాను పోటీ చేయకూడదని  భావించినట్టు చెప్పారు.  

తాను పోటీ చేస్తే  రాష్ట్రంలో పర్యటించడం... ప్రచారం చేయడం కష్టమని భావించి తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు  చెప్పారు.అయితే  రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే  తన సేవలను ఉపయోగించుకోవచ్చనే విషయమై  పార్టీ  అధిష్టానం చూసుకొంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

 

సంబంధిత వార్తలు

కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు

ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్

చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్

పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి

 

click me!