
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎ.మురళి పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కలెక్టర్ అంటే ఖరీదైన బండ్లు, బంగళాలు, డాబు దర్పం కాదన్నది కలెక్టర్ మురళి ఆలోచన. కామన్ మ్యాన్ కు సేవ చేసినోడే సిసలైన కలెక్టర్ అని ఆయన నమ్ముతారు. అందుకే అహో రాత్రులు ఆయన కడు పేదరికంలో జీవిస్తున్న సామాన్యుల చెంతకు వెళ్లి వాళ్ల సాథక బాధకాలు తెలుసుకుంటూ ఉంటారు.
ఆదివారం అంటే ప్రభుత్వ అధికారులు సెలవు మూడ్ లో... పార్టీ మూడ్ లో ఉంటారు. కానీ భూపాలపల్లి కలెక్టర్ మురళి మాత్రం అలా కాదు. ఆయన ఆదివారం కూడా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే కేటాయిస్తారు. తాజాగా ఈ ఆదివారం ఆయన జిల్లాలోని తాడ్వాయి రేంజ్ పరిధిలోని రాపట్ల అటవీ ప్రాంతంలోని గుత్తికోయ గూడెం సందర్శించారు. అక్కడికి వాహనాల్లో వెళ్లడం కుదరదు. అందుకే కలెక్టర్ సైకిల్ మీదే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మురళి ఇప్పుడే కాదు... గతంలోనే అనేక సందర్భాల్లో ఆయన కలెక్టర్ గిరీ పక్కనపెట్టి అతి సామాన్యుడిగా పర్యటనలు జరిపి జనాలకు చేరువయ్యారు. గతంలో టు వీలర్ మీద గ్రామాల్లో పర్యటించడం ద్వారా మురళి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన కూతురు కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిపించడం ద్వారా ప్రభుత్వ దావాఖానాలపై జనాలకు నమ్మకం కలిగేలా చేశారు. ఇంకోసారి ఆయన రోడ్డు మీద వెళ్తుంటే... మంటలు అంటుకుని అటవీ ప్రాంతం తగలబడుతున్నది. ఈ సమయంలో ఆయన కారు దిగి స్వయంగా మంటలు ఆర్పే పనికి పూనుకున్నారు.
గతంలో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ గా ఉన్న సమయంలో నిధులు పక్కాగా పేద ప్రజలకు చేరడం కోసం ఆయన అనేక వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. అయితే,.. అందుబాటులో ఉన్న మాంసాహారం తినాలి... సాంప్రదాయాలు కడుపు నింపవు అన్న ఆయన మాటలు గతంలో వివాదాస్పదమైన సందర్భం కూడా ఉంది.
మొత్తానికి భూపాలపల్లి కలెక్టర్ మురళి వినూత్న పాలన అందరి ఆకర్షిస్తున్నది.