ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు సంధించారు. ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్‌పెయిరీ డేట్ ఉన్నట్టే.. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా తాను ప్రభావం చూపించ గల సమయావధి ఒకటి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేస్తే.. ప్రధాని మోడీ ఇంజిన్ ఆగిపోతుందని, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
Congress: సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ కాలం అయిపోయిందని, ఆయన గద్దె దిగకతప్పదని అన్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయ్ యాత్రతో మోడీ ప్రధాని గద్దె దిగిపోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ భారీ సభ నిర్వహించారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని, అలాగే.. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఆయన ప్రభావం కొంత కాలమే పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభావం ముగిసిపోయిందని, ఇక నరేంద్ర మోడీ వంతు అని వివరించారు. ప్రధాని మోడీ అనే మెడిసిన్ కూడా పని చేయదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ అని తరుచూ అంటూ ఉంటుందని, దీని అర్థం ఒక ఇంజిన్ అదానీ, మరో ఇంజిన్ ప్రధాని అని రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే అదానీ ఇంజిన్ ఆగిపోయిందని వివరించారు. రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబయి వరకు భారత్ న్యాయ్ యాత్ర త్వరలోనే చేస్తారని, ఈ యాత్ర చేస్తే నరేంద్ర మోడీ ఇంజిన్ కూడా ఆగిపోతుందని చురకలంటించారు.
Also Read: Praja Palana: అభయ హస్తం దరఖాస్తు ఫామ్ ఇలా ఉచితంగా పొందండి
ప్రధానమంత్రి మోడీ తనది 56 అంగుళాల ఛాతి అని చెబుతూ ఉంటాడని, కానీ, లోక్ సభలోకి ఓ సాధారణ యువకుడు భద్రతను ఉల్లంఘిస్తూ అడుగు పెడితే.. ఆయన సారథ్యంలోని ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరకుండా కూడా ఆపడం వారి తరం కాదని స్పష్టం చేశారు.