Top Stories: పీఎంతో సీఎం భేటీ.. నేడు సింగరేణి పోరు.. పాక్‌లో హిందూ మహిళ పోటీ

By Mahesh K  |  First Published Dec 27, 2023, 5:21 AM IST

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వక సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతికి ఆర్థిక చేయూత ఇవ్వాలని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా అప్పులు చేశారని పీఎంకు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి గుర్తింపు  కార్మికుల సంఘం ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. కౌంటింగ్ కూడా ఈ రోజే రాత్రి జరగనుంది. మంగళవారం మరో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. అవన్నీ హైదరాబాద్‌లోనే వెలుగుచూశాయి.
 


Todays Top Stories: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అప్పులు చేసిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అడిగారు. దీనితోపాటు బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలకూ జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లు, నిధులను విడుదల చేయాలని కోరగా.. అందుకే పీఎం మోడీ సానుకూలంగా స్పందించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Latest Videos

సింగరేణి ఎన్నికల నగారా

సింగరేణి సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏడాదిన్నర ఎదురుచూపులకు తెర పడింది. ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రోజు సాయంత్రానికే ఓట్లను లెక్కించబోతున్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా టీబీజీకేఎస్, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలు పోటీ పడుతున్నాయి. మొత్తం 13 కార్మిక సంఘాలున్న ఈ సింగరేణి పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, యాదాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read: Corona Cases: తెలంగాణలో మరో 8 కరోనా కేసులు.. 30 శాంపిళ్ల రిజల్ట్ పెండింగ్

పాక్‌లో హిందూ వనిత పోటీ

ముస్లిం మెజార్టీ దేశం పాకిస్తాన్‌లో ఒక హిందూ వనిత ఎన్నికల బరిలో నిలబడటం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పీకే 25 సీటు నుంచి ఆమె బరిలో నిలబడింది. ఆమె పేరు సవీరా పర్కాశ్. వృత్తిరీత్యా ఆమె వైద్యురాలు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

రాజ్యసభకు 55 మంది వీడ్కోలు

వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో 55 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ముగియనుంది. దీంతో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా 27 మంది బీజేపీకి చెందినవారు, పది మంది కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, టీడీపీ, వైసీపీల నుంచి చెరో ఒక నేత ఉన్నారు. ఈ 55 మందిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీ, భూపేంద్ర యాదవ్, నారాయణ్ రాణే, పురుషోత్తమ్ రూపాలా, చంద్రశేఖర్ వి, మురళీధరన్, ఎల్ మురుగన్ నేతలోపాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఏప్రిల్ నెలలో రిటైర్ కాబోతున్నారు. వీటికి మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Lok Sabha Elections: తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్.. డబుల్ డిజిట్స్ సీట్లపై గురి

అన్ని కేసులు హైదరాబాద్‌లోనే..

మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 8 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. ఈ 8 కేసులూ హైదరాబాద్‌లోనే రిపోర్ట్ కావడం గమనార్హం. దీంతో తెలంగాణలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 59కి పెరిగింది. గత 24 గంటల్లో (మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు) మొత్తం 1,333 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ 24 గంటల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చాయి. మరో 30 మంది శాంపిళ్ల రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది.

click me!