లోక్ సభ ఎన్నికలకుగాను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా ఇంచార్జీగా ఉంటారని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ అగ్రనేతలు పలు రాష్ట్రాలను సమీక్షిస్తారని, కేంద్ర హోం మంత్రి తెలంగాణను పర్యవేక్షిస్తారని వివరించారు.
Amit Shah: పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని పార్టీల కసరత్తు ప్రారంభించాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించకున్నా.. ఎంపీ ఎన్నికల్లో ఆధిక్యత ప్రదర్శించాలని బీఆర్ఎస్ బలంగా అనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఫలితాలు రాబట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చాం కాబట్టి.. ఎంపీ సీట్లలో పైచేయి సాధించాలని కాంగ్రెస్ సంకల్పిస్తున్నది. ఈ తరుణంలో రాష్ట్రాల ఇంచార్జీలను కాంగ్రెస్ మార్చిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో బీజేపీ కూడా వెళ్లుతున్నట్టు తెలుస్తున్నది.
పార్లమెంటు ఎన్నికలకుగాను తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి చివరి నెలలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వివరించారు. మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Also Read: BRS: మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. మున్సిపల్ చైర్‌పర్సన్ ఫిర్యాదు
ఒక్కో అగ్రనేత.. ఒక్కో రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. జేపీ నడ్డా, అమిత్ షా, సంతోష్ వంటి అగ్రనేతలు కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. ఇందులో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్ షా నిర్వర్తిస్తారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేవని, కానీ, ఓటు షేర్ మాత్రం గణనీయంగా పెరిగిందని వివరించారు.