రేపు ఉత్తరప్రదేశ్ లో జరగనున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.
హైదరాబాద్ : ఈ రోజు స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఉత్తర ప్రదేశ్, ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్ కు మంగళవారం (రేపు 11.10.22) మధ్యాహ్నం సిఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు.
కాగా, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సింగ్ యాదవ్ నేటి ఉదయం కన్నుమూశారు, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చాలా రోజులుగా ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, పరిస్థితి విషమించటంతో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్తను ఆయన కుమారుడు సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు.
ఆయన మరణం నన్ను బాధిస్తోంది.. ములాయం సింగ్ యాదవ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..
‘నా గౌరవనీయమైన తండ్రి, అందరి నాయకుడు ఇక లేరు’ అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ములాయం సింగ్ యాదవ్ 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్లోని సైఫాయ్ లో జన్మించారు. ఆయన తండ్రి షుగర్ సింగ్ యాదవ్, తల్లి మూర్తి దేవి. ఆయన తొలుత మాలతీ దేవిని వివాహం చేసుకున్నారు. ఆమె మరణానంతరం సాధన గుప్తాను వివాహం చేసుకున్నారు. ములాయం సింగ్ 1960లలోనే రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన రామ్ మనోహర్ లోహియా శిష్యుడు. రామ్ మనోహర్ లోహియా దగ్గర రాజకీయాలలో మెలకువలు నేర్చుకున్నారు.
ములాయం సింగ్ యాదవ్ 1967లో జస్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తన మొదటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. చాలా ఏళ్ల పాటు వివిధ పార్టీలతో కలిసి పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ 1992లో సొంత పార్టీని స్థాపించారు. తన పార్టీకి సమాజ్వాదీ పార్టీ అని పేరు పెట్టారు. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. అతను తన పార్టీలో ఒబీపీ, యాదవ్ కమ్యూనిటీని కలుపుకున్నాడు. ములాయం సింగ్ యాదవ్ సెక్యులర్ నాయకుడు. అందుకే పెద్ద సంఖ్యలో యూపీ ముస్లింలను కూడా ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఈ విధంగా ఓబీసీ ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు.
మొత్తం మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ములాయం సింగ్ యాదవ్ చివరగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొయిన్ పురి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి లోక్సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.