ప్రయాణికుల కళ్లలో కారం కొట్టిన తోటి ప్యాసింజర్.. దుబాయ్ వెళ్లలేకపోయానని దారుణం..

By SumaBala Bukka  |  First Published Oct 10, 2022, 6:45 AM IST

దుబాయ్ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి పాస్ పోర్ట్ రిజెక్ట్ అయ్యింది. దీంతో విమానాశ్రయానికి వచ్చిమరీ వెనక్కి తిరిగాడు. ఆ కోపంతో బస్సులోని ప్రయాణికుల మీద కారంపొడి చల్లాడు.


హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి రాజోలు వెడుతున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో కలకలం చెలరేగింది. ఓ ప్రయాణికుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు దుబాయి వెళ్లేందుకు శంషాబద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అయితే, పాస్ పోర్టు సరిగా లేదంటూ విమానాశ్రయ అధికారులు అతడిని వెనక్కి పంపించేశారు. తిరుగు ప్రయాణలో అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెడుతున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. పాలకొల్లు పట్టణం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రయాణికులపై కారం చల్లాడు. 

Latest Videos

హైదరాబాద్ : చెక్ డ్యాంలో నలుగురు యువకులు గల్లంతు... పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం

ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కారం ఘాటుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పాస్ పోర్ట్ సరిగాలేదని వెనక్కి పంపారని తీవ్ర నిరాశకు గురైన రాంబాబు ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, మేలో మధ్యప్రదేశ్ లో ఇలాంటి కారం ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. భార్య కొట్టిందని ఓ భర్త ఫిర్యాదు చేశాడు. కంట్లో కారం పోసి మరీ కొట్టిందని.. ఆమె నుంచి కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అత్తింటి వారితో వేగలేక పోతున్నానని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్ కు గ్వాలియర్ లోని మహల్ గావు ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. 

సంజయ్ మలాన్ పూర్ లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్ గా పని చేసేవాడు. పెళ్లయిన కొన్నిరోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత క్రమంగా విభేదాలు తలెత్తాయి. అత్తింటి వారిని పూజ అసలు గౌరవించేది కాదట.. ఇంట్లో పనులు కూడా చేసేది కాదట.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదట. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం సంజయ్ ఉద్యోగం కోల్పోయాడు. 

ఆ తరువాతే గొడవలు మరింత పెరిగాయి.ఈ క్రమంలో మే 31 సంజయ్ తల్లిదండ్రులను పూజా తిట్టింది. మీ పేరెంట్స్ మంచివారు కాదు అనడంతో సంజయ్ కి కోపం వచ్చింది. భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని తిట్టాడు. ఆ తర్వాత పూజను  గ్వాలియర్ లోని తన పుట్టింట్లో దింపడానికి వెళ్ళాడు. సంజయ్ తన అత్తింటికి వెళ్ళాక గొడవ మరింత పెద్దదయింది. తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి సంజయ్ పై దాడి చేసింది పూజ. సంజయ్ ను ఇటుకలతో కొట్టడమే కాకుండా.. కంట్లో కారం చల్లారు. అందరూ కలిసి సంజయ్ ను చితకబాదారు. 

ఈ ఘటన తర్వాత అతను నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన భార్య కంట్లో కారం పోసి కొట్టింది అని.. ఆమె నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులను విచారిస్తున్నారు. ఒకవేళ వారు తప్పు చేశారని తేలితే... కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పి పేర్కొన్నారు. 

click me!