
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించడంతో దేశపతి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా శ్రీనివాస్ నామినేషన్ వేయనున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనమే . కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంటక్రామిరెడ్డిల పేర్లను ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు సీఎం.
ALso REad: తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర: ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్
ఇదిలావుండగా.. మలిదేశ తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగిన సమయంలో కీలకంగా వ్యహరించిన కవులు, కళాకారుల్లో దేశపతి శ్రీనివాస్ ఒకరు. గజ్వేల్ సమీపంలోని మునిపడ గ్రామానికి చెందిన దేశపతి శ్రీనివాస్ విద్యాభ్యాసం సిద్ధిపేటలో గడిచింది. హైదరాబాద్‌లోని ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ తెలుగు చదివారు. అనంతరం 1998 నుంచి 2016 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు అండగా నిలిచారు. వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీల్లో తన ఆటపాటలు, రచనలు, ప్రసంగాలతో తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాపింపజేశారు. 2014 నుంచి 2016 వరకు డిప్యూటేషన్‌పై సీఎం ఓఎస్డీగా పనిచేశారు. 2016లో టీచర్ వృత్తికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన దేశపతి శ్రీనివాస్ నాటి నుంచి పూర్తి స్థాయిలో ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.