హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న భవనం పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఈ ప్రాంతానికి ఎవరిని అనుమతించడం లేదు. ఇవాళ ఈ భవనాన్ని కూల్చి వేయనున్నారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఈ భవనం చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. రెండు అంతస్థులు నిర్మించేందుకు అనుమతి తీసుకొని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నాడని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనం కింది భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి.
భవనం పక్కకు ఒరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న భవనంలో నివసించే వారిని ఖాళీ చేయించారు.నిర్మాణంలో ఉన్న భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భవనాన్ని కూల్చి వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు బెంగుళూరుకు చెందిన ఓ సంస్థతో అధికారులు సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం.
ఇవాళ ఈ భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్దంగా భవనం నిర్మిస్తున్న భవన యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.ఒరిగిన భవనాన్ని కూల్చివేసే వరకు ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు.
గతంలో కూడ నగరంలోని చింతల్ లో కూడ ఇదే తరహలో భవనం పక్కకు ఒరిగిపోయిన ఘటన చోటు చేసుకుంది. హైద్రాబాద్ కుత్బుల్లాపూర్ లోని చింతల్ లో మూడంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్ లతో పైకి ఎత్తారు.
అయితే ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్ మెంట్ పైకి వాలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. భవనాన్ని హైడ్రాలిక్ జాక్ లతో పైకి లేపే సమయంలో ఈ భవనంలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అంతేకాదు భవన యజమానిపై కేసు నమోదు చేశారు.
భవనాలు నిర్మించే సమయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్ల కూడ ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేయడం, నాణ్యంగా నిర్మాణాలు చేయని కారణంగా ఈ రకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.