KCR: ప్రతిపక్షంలో ఉన్నా.. కేంద్రానికి కేసీఆర్ సవాల్.. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటీ?

By Mahesh K  |  First Published Feb 13, 2024, 6:38 PM IST

నల్లగొండ సభలో కేసీఆర్ ఈ రోజు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. కృష్ణా జలాల వాటాను ప్రస్తావిస్తూ కేంద్రంపై కామెంట్లు చేశారు. వాటా దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఓ హెచ్చరిక అంటూ 
 


KCR Nallagonda Meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ ఓ బహిరంగ సభలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు నల్లగొండ సభ ఒక బలప్రదర్శన సభ. ఈ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాడిగా మాట్లాడారు. మళ్లీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు యుద్ధోన్ముఖులు కావాలని, నీటి ఉద్యమానికి సంసిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ప్రజలను మోసం చేసే పని చేసినా.. ఇచ్చిన మాట తప్పినా విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. 

కేఆర్ఎంబీకి బాధ్యతలు అప్పగించడమంటే.. మనం కరెంట్ తయారు చేసుకోవాలన్నా.. వాళ్లను చిప్పపట్టి అడుక్కోవడమేనని నల్లగొండ సభలో కేసీఆర్ అన్నారు. కృష్ణా నదిలో మన వాటాకు వచ్చే నీళ్లను దొబ్బి పోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఓ హెచ్చరిక అని అన్నారు. అంతేగానీ.. కొంత మంది తెలివిలేక ఇది వాళ్లకు వ్యతిరేకం అని అనుకుంటున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కామెంట్ చేశారు. నీటి వాటా తేల్చాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి మోడీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు లేఖలు రాశామని, ఇన్నాళ్లు వాటిని కాపాడుకుంటూ వచ్చామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కేంద్రం చేతుల్లో పెట్టిందని ఆరోపించారు.

Latest Videos

undefined

ఇది చిల్లరమల్లర సభ కాదని, రాజకీయ సభ కానేకాదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికో, రాష్ట్ర నాయకులకో కాదని పేర్కొన్నారు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి గానీ, మన నీటిని దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు గానీ ఈ సభ హెచ్చరిక అని వివరించారు.

Also Read: YS Sharmila: రేవంత్‌తో షర్మిల భేటీ.. వైసీపీలో కలవరం.. భారీ మూల్యం తప్పదా?

ఇక్కడ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. తెలంగాణ నీటి వాటాపై అన్యాయం చేయాలని చూస్తే కేంద్రంపై పోరాడుతామని పరోక్షంగా పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ముంగిట నీటి వాటా అంశాన్ని లేవనెత్తుతూ తమ పోరాటం కేంద్రంలోని బీజేపీపై అని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నది. అందుకే ప్రత్యర్థిగా బీజేపీని సెట్ చేసుకున్నారని, బీజేపీపై దాడి చేసి సీట్లు సాధించాలనే సంకేతాలను కేసీఆర్ ఈ సభలో ఇచ్చినట్టయింది. తద్వార లోక్ సభలో బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనే నెరేటివ్ సెట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇక పోతే.. డబుల్ స్పీడ్‌తో వచ్చేది మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ఈ సభలో ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అయితే.. ఇంతలో కాంగ్రెస్ ఏ ఆటలు ఆడినా.. తాము కట్టడి చేస్తామని, 24  ఏళ్లు తెలంగాణ కోసం పని చేసిన తనకు ఈ రాష్ట్రంపై గర్జు ఉంటదని, ఎక్కడ నష్టం జరుగుతుందోననే ఆలోచన నిత్యం ఉంటుందని చెప్పారు. తెలంగాణ నీటి కేటాయింపుల్లో నష్టపోవద్దనే లక్ష్యంగానే ఈ సభ పెట్టినట్టు చెప్పారు.

click me!