కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలున్నాయి: తుమ్మల నాగేశ్వరరావు

By narsimha lodeFirst Published Feb 13, 2024, 4:56 PM IST
Highlights

కాళేళ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన  మేడిగడ్డ బ్యారేజీని  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం ఇవాళ పరిశీలించింది

కరీంనగర్:కాళేశ్వరం డిజైన్ లో ఎన్నో లోపాలున్నాయని  తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.  మంగళవారంనాడు  మేడిగడ్డ బ్యారేజీ వద్ద  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల డిజైన్ లో లోపాలున్నాయని ఆనాడే చెప్పానన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజీ అని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలిస్తేనే ఎక్కడికైనా ఎత్తిపోసేదని ఆయన చెప్పారు. 

also read:నీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

మేడిగడ్డలోనే నీరు ఉండని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక  మిగిలిన జలాశయాలకు  నీటిని ఎలా ఎత్తిపోస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.మేడిగడ్డ బ్యారేజీని ఇవాళ  సీఎం  అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం  పరిశీలించింది. ఈ పర్యటనకు  బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ  బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

also read:మేడిగడ్డ బ్యారేజీ: కుంగిన పిల్లర్లను పరిశీలించిన సీఎం రేవంత్ సహా ఎమ్మెల్యేల బృందం

దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  ఈ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.  గతంలోనే మేడిగడ్డ బ్యారేజీని బీజేపీ నేతలు పరిశీలించినందున ఇప్పుడు మరోసారి పరిశీలించేందుకు వెళ్లాల్సిన అవసరం లేదని  బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.ఈ బ్యారేజీని పరిశీలించిన తర్వాత  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడ బీజేపీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు.

తెలంగాణలో  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారు.  గత ఏడాది  అక్టోబర్ మాసంలో  మేడిగడ్డ బ్యారేజీ  పిల్లర్లు కుంగిపోయాయి.  ఈ విషయం అప్పట్లో  బీఆర్ఎస్ పై  కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని కూడ పరిశీలించిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై  కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది. 



 

click me!