కాంగ్రెస్ లోకి 30మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి కోమటిరెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published Jan 23, 2024, 11:48 AM IST
Highlights

లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరింత బలపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.  బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి భారీగా ఎమ్మెల్యేలు చేరనున్నారని మంత్రి తెలిపారు. 

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువరోజులు వుండదని కొందరు... ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మరికొందరు మాటలదాడికి దిగారు. ఇలా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించేలా బిఆర్ఎస్, బిజెపి నాయకులు చేస్తున్న కామెంట్స్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే అధికార కాంగ్రెస్ లో భారీగా చేరికలు వుంటాయంటూ బాంబ్ పేల్చారు. 

నల్గోండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే లోక్ సభ ఎన్నికల గురించి మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగానే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని కోమటిరెడ్డి అన్నారు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వుంటాయన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 30మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Also Read  Raja Singh: లోక్ సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఆసక్తి.. హైదరాబాద్ సీటు వద్దని.. అక్కడి నుంచి పోటీకి సై

ఇదిలావుంటే ఇటీవల బిజెపి ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారని... ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోతుందని సంజయ్ జోస్యం చెప్పారు.  

కాంగ్రెస్ లో కొందరు కేసీఆర్ కోవర్టులు వున్నారని ... వాళ్లద్వారానే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ భారీఎత్తున నిధులు ఇచ్చి కోవర్టులుగా మార్చుకున్నారని... వారి సాయంతోనే మరికొందరికి గాలం వేస్తున్నాడని అన్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కేసీఆర్ టచ్ లోకి వెళ్లారని అన్నారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరసారాలు సాగుతున్నాయని ... ప్రభుత్వాన్ని కూల్చి ఇదంతా బిజెపి చేసిందని బదనాం చేస్తారని సంజయ్ అన్నారు.

click me!