శాంతి భద్రతలు కాపాడండి.. రజాకార్ సినిమా బ‌హిష్క‌ర‌ణ‌కు బీఆర్ఎస్ నాయ‌కురాలు క‌విత పిలుపు

By Mahesh Rajamoni  |  First Published Sep 22, 2023, 12:35 PM IST

Hyderabad: రజాకార్ సినిమాను తిరస్కరించాలని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 
 


BRS leader Kavitha comments on Razakar movie: ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార బీఆర్ఎస్ మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్ గా మారిన తెలుగు సినిమా 'రజాకార్'ను తిరస్కరించాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ పిలుపునిచ్చారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి మత కలహాలు లేకుండా, సామరస్యం, శాంతికి మారుపేరుగా తెలంగాణ‌ నిలిచిందన్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో బీజేపీ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేశాలు, మ‌త క‌ల‌హాలు సృష్టించేందుకు కుట్ర‌చేస్తోంద‌ని ఆరోపించారు. ర‌జాకార్ సినిమాను బీజేపీ నేత‌లు నిర్మించార‌నీ, శాంతికి భంగం క‌లిగించే విధంగా కుట్ర చేస్తున్నార‌ని పేర్కొంటూ ఆ సినిమాను తిర‌స్క‌రించాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు.

"మత కలహాలు లేకుండా, సామరస్యం, శాంతికి మారుపేరు తెలంగాణ‌. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు వచ్చి పని చేస్తుంటారు. కాబట్టి శాంతిని పరిరక్షించాలి. కాబట్టి ఇలాంటి వివాదాస్పద సినిమాలను తిరస్కరించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని క‌విత పేర్కొన్నారు. ప్రజల మధ్య దూరాన్ని పెంచే అంశాలపై సినిమాలు తీసే కొత్త ఒరవడికి ప్రతిపక్షాలు శ్రీకారం చుట్టాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బీజేపీపై విరుచుకుపడ్డారు. "ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దురదృష్టవశాత్తూ ఈసారి మన తెలంగాణలో బీజేపీ అలాంటి కుట్ర చేస్తోంది" అని ఆమె అన్నారు.

Latest Videos

హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న 'రజాకార్' సినిమా ట్రైలర్ విడుదలైంది. అప్ప‌టి నుంచి ఈ ట్రైలర్ రాజకీయ నాయకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2 నిమిషాల నిడివి గల ఈ సినిమా ట్రైలర్ లో నిజాం పాలనలో హిందూ ప్రజలపై హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు చేసిన క్రూరత్వం, దౌర్జన్యాల గురించి చూపించారు. ట్రైలర్ లో వివాదాస్పద డైలాగులతో పాటు సున్నితమైన సన్నివేశాలను కూడా చూపించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇలాంటివి చేస్తున్నారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారనీ... తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని, అందుకే ఇదంతా జరుగుతోందని బీజేపీపై ఆయ‌న మండిప‌డ్డారు.

click me!