పరిమళించిన జంతుప్రేమ... డప్పుచప్పుళ్ళు, టపాసుల మోతల మధ్య ఘనంగా ఆంబోతు అంత్యక్రియలు

By Arun Kumar P  |  First Published Sep 22, 2023, 10:14 AM IST

ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రజలకు పశువులపై మమకారం ఏమాత్రం తగ్గలేదు.  ఇలా మూగజీవాలతో గ్రామీణ ప్రజలకు వున్న అనుబంధాన్ని తెలియజేసే ఓ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. 


సూర్యాపేట : సాటి మనుషులకు ఏమయినా పట్టించుకోని ఈ కలికాలంలో ఓ మూగజీవి కోసం ఆ గ్రామం మొత్తం తల్లడిల్లిపోయింది. తమ కళ్లముందే తిరిగే ఆంబోతు అస్వస్థతతో చనిపోతే ఆ  గ్రామస్తులంతా  కన్నీటిపర్యంతం అయ్యారు. ఆంబోతు మృతదేహానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి మూగజీవాలపై ప్రేమను చాటుకున్నారు. మానవత్వం పరిమళించిన ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. 

గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువులను కుటుంబంలో భాగంగా చూసుకునేవారు మన పెద్దవాళ్లు. వ్యవసాయంలో ఉపయోగపడే పాడి పశువులను ఎంతో ఇష్టంగా పెంచుకునేవారు. కాలక్రమేణా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి పశువుల పెంపకం తగ్గిపోయింది. దీంతో గ్రామీణ ప్రజలకు వాటితో అటాచ్ మెంట్ కూడా తగ్గిపోయింది. అయినప్పటికి కొన్ని గ్రామాల్లో మూగ జీవాలతో ప్రజలు అనుబంధం పెంచుకోవడం కనిపిస్తుంది. ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామంతో ఓ ఆంబోతు చనిపోతే అత్యంత ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి జంతుప్రేమను చాటుకున్నారు గ్రామస్తులు. 

Latest Videos

మఠంపల్లి గ్రామానికి చెందిన ఓ ఆంబోతు రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యింది. తమ కళ్లముందే రంకెలేస్తూ తిరిగే ఆ ఆంబోతు ఇలా నీరసంగా వుండటం చూసి గ్రామస్తులు స్థానిక పశువుల హాస్పిటల్ కు తరలించారు. వైద్యం అందించినా ఆంబోతూ పరిస్థితి మెరుగుపడకుండా మరింత క్షీణించింది. ఇలా రెండ్రోజులు అస్వస్థతతో బాధపడ్డ ఆంబోతు గురువారం మద్యాహ్నం చనిపోయింది. 

ఎంతో ప్రేమగా చూసుకునే ఆంబోతు మృతి గ్రామస్తులను ఎంతో బాధించింది. తమతో మమేకమైన ఆ మూగజీవి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించి తుది వీడ్కోలు పలకాలని మఠంపల్లి వాసులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ పై ఆంబోతు మృతదేహాన్ని వుంచి డప్పుచప్పుళ్లు, టపాసుల మోత మధ్య ఊరంగా ఊరేగించారు. అంతిమయాత్రలో గ్రామానికి చెందిన మహిళలు సైతం పాల్గొని కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఆంబోతు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించి ఊరిచివర ఖననం చేసారు.

తమతో మమేకమైన ఆంబోతును మరిచిపోలేకపోతున్నామని... అందువల్లే మరో మేలురకం కోడెదూడను ఎంపికచేసి ఆంబోతుగా ప్రకటించనున్నట్లు మఠంపల్లి వాసులు తెలిపారు.  ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పశువులతో వుండే అనుబంధాన్ని బయటపెట్టింది.  
 

click me!