
ఢిల్లీ పర్యటనలో వున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో బీజేపీ (bjp) ఫైర్ బ్రాండ్ , రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి (subramanian swamy) సమావేశమయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన స్వామి భేటీ అయ్యారు. అయితే నిన్న మొన్నటి వరకు ఎన్డీయేతర ముఖ్యమంత్రులను కలిసిన సీఎం కేసీఆర్ .. ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు.. కేసీఆర్ (K Chandrasekhar Rao) దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఆయన కంటికి సంబంధించిన పరీక్షలను నేడు చేయించుకోనున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన కంటి పరీక్షలు చేయించుకోవాలని భావించినా నేత్ర వైద్య నిపుణుడు సచ్‌దేవ్ అందుబాటులో లేకపోవడంతో నేటికి వాయిదా పడింది.అలాగే, కేసీఆర్ సతీమణి శోభ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేటి కంటి పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి దంపతులు తిరిగి హైదరాబాద్ రానున్నారు.
అంతకు ముందు Telangana ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం నాడు దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao) దేశ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి గత కొన్ని రోజులుగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. వారిలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వంటి వారు ఉన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా సీఎం కేసీఆర్ ఇటీవల కలిశారు. మున్ముందు మరింత మంది నేతలను, ముఖ్యమంత్రులను కలుస్తానని వెల్లడించారు. అతి త్వరలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు సాగడానికి కలిసివచ్చే అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఇటీవల వెల్లడించారు.
దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrasekhar Rao) రాష్ట్రంలో కాకుండా ఇతర ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లారంటే అది రాజకీయాల కోసమే అనే ప్రచారం సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సైతం ఇదే క్రమంలో ఉందని అందరూ భావించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అరవింద్ కేజ్రీవాల్ కలవడం కోసమేననీ, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని చర్చ జరిగింది. కానీ, సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao) ఈ పర్యటన వ్యక్తిగతమైందని ప్రస్తుతం తెలుస్తోంది. టీఆర్ఎస్ సీనియర్ నేతలు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదనీ, రాజకీయపరమైనది కాదని తాజాగా వెల్లడించారు.