రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు: అసత్య ప్రచారం చేయడం సరికాదన్న డీజీపీ మహేందర్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Mar 3, 2022, 1:24 PM IST
Highlights

కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) స్పందించారు. తనపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం అని అన్నారు. తెలంగాణ పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) స్పందించారు. తనపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం అని అన్నారు. తెలంగాణ పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని స్పష్టం చేశారు. త‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపించింద‌ని రేవంత్ చేసిన ఆరోప‌ణ‌లు ఏ మాత్రం వాస్త‌వం కాద‌ని తెలిపారు. ఇంట్లో జారిపడటంతో తన ఎడమ భుజంపై గాయం అయిందని తెలిపారు. అందుకే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. 

‘ఇంట్లో జారిప‌డ‌టంతో ఎడ‌మ భుజానికి గాయ‌మైంది. మూడు చోట్ల ఫ్యాక్చ‌ర్స్ అయిన‌ట్లు ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టుల‌లో తేలింది. దీంతో డాక్టర్లు భుజం క‌ద‌ల‌కుండా క‌ట్టు క‌ట్టారు. దీంతో విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 18 నుంచి మార్చి 4వ తేదీ వ‌ర‌కు సెల‌వులో ఉన్నాను. వైద్యుల స‌ల‌హా మేర‌కు విధుల్లో చేర‌డం జ‌రుగుతుంది. భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడుతున్నాను’ అని మహేందర్ రెడ్డి చెప్పారు. 

సీనియర్ అధికారిపై ఆరోపణలను చేయడం స‌రికాద‌ని చెప్పారు. ఆల్ ఇండియా స‌ర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు వ్యాఖ్య‌లు చేసేట‌ప్పుడు సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. మ‌రోవైపు, ఐఏఎస్‌లను నిందించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

ఇక, తెలంగాణ రాష్ట్రాన్ని బిహార్ ఐఏఎస్‌ల‌ ముఠా ఏలుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు చెందిన మ‌హేంద‌ర్ రెడ్డిని సైతం ప‌క్క‌న‌బెట్టి బిహార్‌కు చెందిన అంజ‌నీకుమార్‌ను ఇన్‌చార్జ్‌ డీజీపీగా నియ‌మించార‌ని రేవంత్ రెడ్డి చ‌సిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేప‌థ్యంలో దీనిపై మ‌హేందర్ రెడ్డి స్పందించారు. 
 

click me!