
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ శత్రువులు లేరని.. ఎవరైనా ఊహించుకుంటే ఏం చేయలేనని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ.. మోడీ పట్టు బడితే చేస్తారని, దానికి తాజా నిదర్శనం మహిళా రిజర్వేషన్ బిల్లేనని అన్నారు. కేసీఆర్ హామీలన్నీ నీటి మూటలయ్యాయని.. హామీలు ఇవ్వడం కాదు, అమలు చేయడం ముఖ్యమన్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని రాజేందర్ ప్రశ్నించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇస్తోందని.. రాష్ట్రం దివాళా తీసిందని వాళ్లే చెబుతున్నప్పుడు వారు ఇచ్చిన హామీలు ఎలా అమలవుతాయని ఈటల నిలదీశారు.
ALso Read: నిధులన్ని మీ నియోజకవర్గాలకేనా..! :మంత్రి హరీశ్ రావుకు ఈటల సవాల్
ఒకేసారి రుణమాఫీ చేయడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదన్నారు. ఆర్ధిక మంత్రిగా పనిచేసిన తనకు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై అవగాహన వుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతో సాధ్యమయ్యే పథకాలను తెలంగాణలో ప్రవేశపెడతామని రాజేందర్ తెలిపారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. కుట్రలు చేసి వుంటే తాను 22 ఏళ్లుగా ఎలా గెలుస్తానని రాజేందర్ ప్రశ్నించారు. తాను ప్రజలను, శ్రమను, ధర్మాన్ని నమ్ముకున్నానని ఈటల పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని ఇప్పటికే వంద సార్లు చెప్పానని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు.