హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ ఓపెనింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌తో మేనేజ్మెంట్, తల్లిదండ్రులు జరిపిన చర్చలు ఫలప్రదమైనట్లుగా సమాచారం.
విద్యా శాఖ కమీషనర్‌తో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ భేటీ ముగిసింది. డీఏవీ స్కూల్ రీ ఓపెనింగ్‌కు అధికారులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీలో కథనాలు వస్తున్నాయి. వారంలోగా స్కూల్‌ను రీ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యా శాఖ కమీషనర్ హామీ ఇచ్చినట్లుగా ఎన్టీవీ తన కథనంలో తెలిపింది. అనంతరం తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. విద్యా శాఖ కమీషనర్‌కు అన్ని విషయాలు తెలియజేశామన్నారు. వారం రోజుల్లో స్కూల్ రీ ఓపెన్ అవుతుందన్న భరోసాను కమీషనర్ ఇచ్చారని వారు చెబుతున్నారు.
ఇదిలావుండగా... అత్యాచార ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని స్కూల్ రీ ఓపెనింగ్‌కు అనుమతించాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డిఏవి పబ్లిక్ స్కూల్ ను ఇక్కడే రీ ఓపెన్ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్కు వద్ద డి ఏవి స్కూల్ కు చెందిన సుమారు 200మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు.
ALso REad:ఆ దారుణం కలచివేసింది, నిందితులను వదలొద్దు : డీఏవీ స్కూల్ ఘటనపై చిరంజీవి స్పందన
చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ తెరవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదని అన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులను స్టేట్ సిలబస్ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అని అన్నారు. మెరీడియన్ స్కూల్లో చేర్చడానికి కూడా అది తాహతుకు మించిన వ్యవహారం అవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రులు అభిప్రాయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా... బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఎస్ మాధవీపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.