బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం: శిక్షణ లేనివాళ్లు డ్రైవర్లా..? కేసీఆర్‌పై మృతురాలి భర్త ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Nov 27, 2019, 5:39 PM IST
Highlights

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెం. 12లో టీసీఎస్ ఉద్యోగి సోహిని సక్సేనా అకాల మరణంతో ఆమె భర్త, కుటుంబసభ్యులు, మిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెం. 12లో టీసీఎస్ ఉద్యోగి సోహిని సక్సేనా అకాల మరణంతో ఆమె భర్త, కుటుంబసభ్యులు, మిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హుస్సేనీ ఆలంలో ఉంటున్న తన పెద్దన్నయ్య రిషికేష్ సక్సేనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సోహిని మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు.

ఈ క్రమంలో బంజారాహిల్స్‌ రోడ్ నెం.12 నుంచి రోడ్ నెం.1 వైపు వెళ్లే రోడ్డుపై వస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో యాక్టివాపై వెళ్తున్న సోహినిని వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది.

Also Read:స్కూటీని ఢీకొన్న ఆర్టీసి బస్సు...టీసిఎస్ ఉద్యోగిని మృతి, డ్రైవర్ పై రాళ్లదాడి

దీంతో ఆమె తల బలంగా రోడ్డును తాకగా.. స్కూటీ బస్సు చక్రాల కింద నలిగిపోయింది. ఈ ప్రమాదంలో సోహిని దుర్మరణం పాలయ్యారు. చెల్లెలి రాకకోసం ఎదురుచూస్తున్న రిషికేశ్‌కు ఆమె మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేసిన వైద్యులు అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

సోహిని మృతితో ఆమె కుటుంబసభ్యులు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఎలాంటి శిక్షణ లేని తాత్కాలిక డ్రైవర్లను నియమించుకోవడంపై మండిపడ్డారు. ఉస్మానియా మార్చురీ వద్ద ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమలా మరో కుటుంబం బాధపడకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సోహినికి రిషికేశ్, అమరేశ్, విశేశ్ అనే ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ఆమె భర్త వినీత్ కుమార్ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

సోహిని రోడ్డు ప్రమాదంలో మరణించిందని తెలియగానే ఆయన ఉస్మానియాకు పరుగు పరుగున వచ్చారు. తల చితికిపోయి, మెదడు ముద్దలు ముద్దలుగా కిందపడటాన్ని చూసి ఆయన కన్నీరు మున్నీరయ్యారు. ఈ రోజు ఉదయం తాను ఆఫీసుకు వెళ్తున్నానని సోహిని ఫోన్ చేసిందని.. అదే ఆమెతో తన చివరి మాటని ఆయన రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.

ఎంతో ఉన్నత చదువులు చదివి, ఆత్మవిశ్వాసంతో బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న తన చెల్లెలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిందని ఆమె అన్నయ్య వాపోయాడు.

Also read:బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం దృశ్యాలు

శిక్షణ లేని వ్యక్తులను ప్రజా రవాణా వాహనాలను నడపటానికి అనుమతించడం సిగ్గుచేటని.. తన సోదరి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. తనకు ఉదయం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చెల్లెలు.. మధ్యాహ్నం ఇంటికి వస్తానని చెప్పిందని, ఇప్పుడు ఆమె లేదని రిషికేశ్ బోరుమన్నాడు.

click me!