హైదరాబాద్ లో అరుదైన ప్రసవం... ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

By Arun Kumar PFirst Published Oct 27, 2021, 11:00 AM IST
Highlights

ఓ గర్భిణి మహిళ అత్యంత అరుదుగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన ఘటన హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: గర్భంతో వున్న మహిళలు సాధారణంగా ఓ బిడ్డకు జన్మనిస్తుంటారు... అరుదుగా కొందరు కవలలకు(ఇద్దరు బిడ్డలు) జన్మనిస్తుంటారు. చాలా అరుదుగా ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చినట్లు మనం వింటుంటాం. కానీ ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన అత్యంత అరుదైన సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

hyderabad మెహదీపట్నంలోని మీనా హాస్పిటల్ లో ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ప్రసవం కోసం చేరింది. అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ఆమె ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలను కనడం చాలా అరుదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. పుట్టిన నలుగురూ ఇంత ఆరోగ్యవంతంగా వుండటం  మరీ అరుదని అంటున్నారు. 

ఒకేసారి నలుగురు బిడ్డలు పుట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తల్లీ, బిడ్డలు క్షేమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొన్నిరోజులు తమ పర్యవేక్షణలో తల్లీ బిడ్డలను వుంచుకుని ఎలాంటి సమస్యలులేకుంటే డిశ్చార్జి చేసి పంపిస్తామని హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. 

read more  రహదారి లేదు.. అంబులెన్స్ రాదు.. విశాఖ ఏజెన్సీలో నిండుగర్భిణి పాపకు జన్మనిచ్చి మృతి

ఈ ఏడాది ఆగస్ట్ లో కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళ కూడా ఇలాగే ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.  జిల్లా కేంద్రంలోని యశోద ఆస్పత్రిలో ప్రసవం కోసం చేరిన గర్భిణికి ఆపరేషన్ చేసిన వైద్యులు నలుగురు బిడ్డలను బయటకు తీసారు. ఆమెకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తో డెలివరీ చేశారు. ఇలా సాయి క్రిష్ణ, నిఖిత దంపతులకు నలుగురు పిల్లలు జన్మించారు. వీరిలో ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.  

ఈ సమయంలోనే డాక్టర్ ఆకుల శైలజ మాట్లాడుతూ... నిఖిత, ఆమె సోదరి కూడా ట్విన్సేనని తెలిపారు. అంతేకాదు. ఆమె సోదరికి ఇంతకుముందు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టగా... నిఖితకు ఒకే కాన్పులో నలుగురు పుట్టడం ఆశ్చర్యం అని అన్నారు. ఇలా ఎనిమిది లక్షల మందిలో ఒక్కరికి జరుగుతుందని డాక్టర్ అన్నారు. 

click me!