హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లోని తిరుమలగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమలగిరిలోని మడ్‌ఫోర్ట్‌లో శుక్రవారం ఉదయం 40 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. దేవమ్మ అనే ఆ మహిళ గొంతు కోసి హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తిరుమల్ గిరి పోలీసులు తెలిపారు. అయితే, మృతురాలి ఒంటిమీద చెవిపోగులు కనిపించకపోవడంతో.. డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
శుక్రవారం ఉదయం రక్తపు మడుగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్య అని నిర్ధారించిన పోలీసులు ముందుగా బాధితుడిని గుర్తించే పని మొదలుపెట్టారు. ఆమె ఫోటోను స్థానికంగా ఉన్న కాలనీల్లో పంచిపెట్టారు. దీని ద్వారా మృతురాలి గుర్తింపును తెలుసుకున్నారు.
undefined
ఆసుపత్రి బెడ్‌పై కుక్క..మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాసుపత్రిలో ఘటన, వీడియో వైరల్...
దేవమ్మ మద్యం మత్తులో ఉన్నప్పుడే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె చివరిసారిగా ఎవరితో కనిపించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె చివరిగా ఏ కల్లు దుకాణానికి వెళ్ళింది.. ఆమె మీద లైంగిక వేధింపులు జరిగాయో లేదో తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. దేవమ్మ స్వస్థలం వనపర్తి జిల్లా. నెలరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి దినసరి కూలీగా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది.
ఇదిలా ఉండగా, వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాన్నిబలి తీసుకున్న సంఘటన చిత్తూరు నగరంలో గురువారం వెలుగు చూసింది. వన్టౌన్ సీఐ నరసింహరాజు కథనం మేరకు, పుంగనూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డి (50)భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్లుగా చిత్తూరులో ఆయన కూరగాయలు, తినుబండారాలు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈయనకు యాదమరికి చెందిన లలితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ సుందరయ్య వీధిలోని లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత డబ్బుల విషయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కోపంతో లలిత ఈశ్వర్ రెడ్డిని నెట్టేయడంతో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడే మృతి చెందాడు. అదేమీ పట్టించుకోని లలితా.. తాపీగా..గురువారం ఉదయం గది తాళాలు వేసి రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం లాడ్జ్ ని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరిచి చూడగా ఈశ్వర్ రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఆ తరువాత అక్కడి పరిస్థితులను పరిశీలించిన పోలీసులు.. ఈశ్వర్ రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లాడ్జి గదిని లలిత పేరు మీద బుక్ చేయడంతో పోలీసులు పని సులభమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.