Barrelakka: బర్రెలక్క వెనుక ఎవరు ఉన్నారు? గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్లుతుంది?

By Mahesh KFirst Published Nov 26, 2023, 4:04 PM IST
Highlights

ఆ ఒక్క వీడియో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష జీవితాన్ని మలుపుతిప్పింది. ఆమె కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. డబ్బు చూపినా, బెదిరించినా, తమ్ముడిపై దాడి జరిగినా బరిలో నుంచి తప్పుకోని బర్రెలక్క వెనుక ఎవరు ఉన్నారు? ఏ పార్టీ మద్దతు ఉన్నది? ఆమె ఒక వేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్లుతుంది?
 

కొల్లాపూర్ నియోజకవర్గంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. నిరుద్యోగుల అసంతృప్తి, ఆగ్రహావేశాలకు ఆమె రూపంగా మారుతున్నది. ప్రభుత్వ వ్యతిరేకతకూ ఆమె సింబల్‌గా మారిపోతున్నది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేద కుటుంబం నుంచి స్వచ్ఛందంగా బరిలో నిలబడిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష వైపు అందరూ చూస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలబడిన.. ఆమె తన అఫిడవిట్‌లో చరాస్తులు కేవలం 6,500 అని పేర్కొంది. బయటికి కనిపించని పొలిటికల్ స్ట్రాటజీ ఏమీ లేని, సాదాసీదా ఆడపిల్ల అని ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వస్తున్నది. కొందరు ఆర్థికంగానూ సహకరిస్తున్నారు.

నేటి వ్యవస్థలో ఇంత సాదాసీదాగా ఎన్నికల్లో ఒకరు పోటీ చేయడం, అందుకు ఇంత పెద్ద మద్దతు రావడం చాలా మందిని ఆశ్చర్యానికి.. సంశయానికి గురి చేస్తున్నది. ఒకరు ఎన్నికల బరిలో నిలబడాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పలుకుబడి తప్పనిసరి అని, బయటికి కనిపించని మరో అంతర్గత వ్యూహం ఉండి తీరుతుందని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే బర్రెలక్కను విశ్వసిస్తున్నప్పటికీ ఆమె వెనుక ఉన్నదెవరు? ఏ పార్టీ హస్తం ఉన్నది? ఎవరి మద్దతుతో ఆమె బరిలోకి వెళ్లుతున్నది? గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్లుతుంది? వంటి అనేక ప్రశ్నలు చర్చిస్తున్నారు. ఇందులో కొన్నింటికి బర్రెలక్క స్వయంగా కొన్ని ఇంటర్వ్యూల్లో సమాధానాలు చెప్పారు.

Latest Videos

Also Read: Barrelakka: కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీతో ఎవరికి నష్టం? ఎవరికి మేలు?

బర్రెలక్క తాను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి రావడం కాకతాళియంగా తీసుకున్న మలుపు అని వివరించింది. దీని వెనుక దీర్ఘకాల కసరత్తు ఏమీ లేదని, అనూహ్యంగా తీసుకున్న నిర్ణయమే ఇది అని తెలిపింది. తన వెనుక ఏ పార్టీ లేదని ఆమె స్పష్టం చేసింది. తాను స్వతంత్రంగా పోటీలో ఉన్నట్టు చెప్పింది. మాల సామాజిక వర్గానికి చెందిన ఆమె అధికార పార్టీపై విమర్శలూ సంధించింది. ఉద్యోగాలు సక్రమంగా భర్తీ చేస్తే తాను పోటీ చేయాల్సిన అవసరమే ఉండేది కాదని స్పష్టం చేసింది. తన తమ్ముడిపై దాడి జరిగినప్పుడూ.. ప్రజలు ఎన్నుకున్న నేత వర్గీయులే తన తమ్ముడిపై దాడి చేశారని పరోక్షంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేసింది.

బర్రెలు కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అని బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష చెప్పే వీడియో సోషల్ మీడియా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని కల్పిస్తున్నదనే కోణంలో ఓ కేసు కూడా ఆమె మీద ఫైల్ అయింది. 

Also Read: Lightning: పిడుగుపాటుతో బిల్డింగ్ పైకప్పుకు మంటలు.. ఎగసిపడ్డ అగ్నికీలలు.. స్పాట్‌కు ఫైర్ ఇంజిన్లు

ఓ ఇంటర్వ్యూలో బర్రెలక్క మాట్లాడుతూ.. తనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇష్టమని, ఆయన ఆదర్శం అని తెలిపింది. తనపై కేసులు ఫైల్ అయినప్పుడు ఆయన తనకు సహకరించినట్టూ వివరించింది. ఒక వేళ బర్రెలక్క గెలిస్తే భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరుతారని అడగ్గా.. తాను ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేసింది. తాను నిరుద్యోగుల కోసం పోరాడుతున్నానని, ప్రజా సంక్షేమం కోసం చివరి వరకు పోరాడుతానని, ఏ పార్టీలోనూ చేరబోనని వివరించింది. ఎన్నికల్లో ఓడిపోయినా సేవ చేస్తూనే ఉంటానని తెలిపింది.

click me!