బంధువుల కోసం, భూముల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు : కేసీఆర్‌పై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

By Siva KodatiFirst Published Nov 26, 2023, 4:03 PM IST
Highlights

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారంటూ కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 
 

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని  ఆరోపించారు. అసలు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాలని మిమ్మల్ని అడిగిందెవరు.. బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారంటూ కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

జిల్లాల విభజన సమయంలో ఓ ప్రజా ప్రతినిధి పక్క జిల్లాలోని మండలాన్ని తన జిల్లాలో బలవంతంగా కలిపేసుకున్నాడని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో తన బావమరిదికి ఇబ్బందులు రాకుండా వుండేందుకే ఆయన అలా చేశారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కొందరు నేతలు బినామీ పేర్లతో భూములు కొని.. వాటికి విలువ వచ్చేందుకే జిల్లాలను ఏర్పాటు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. నేతల భూములకు దగ్గరలోనే కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయని , దీంతో సదరు భూముల విలువ భారీగా పెరిగిందన్నారు. పరిపాలనను గాలికొదిలేసి.. ప్రజలను నడిరోడ్డు మీదికి తీసుకొచ్చిందుకు ఓటర్లు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.  

Latest Videos

click me!