DK Shivakumar: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నాలు కేసీఆర్ మొదలుపెట్టారు: డీకే శివకుమార్ సంచలనం

By Mahesh K  |  First Published Dec 1, 2023, 10:17 PM IST

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎగ్జిట్ పోల్స్ పై విశ్వాసం లేదని అన్నారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే సీఎం కేసీఆర్ అప్రోచ్ అవుతున్నట్టు తనకు సమాచారం ఉన్నదని తెలిపారు. కానీ, ఆయన ప్రయత్నాలు సఫలం కాబోవని స్పష్టం చేశారు.
 


హైదరాబాద్: కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని తెలంగాణలోని తన వర్గాలు కొన్ని చెప్పాయని జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బీఆర్ఎస్ వైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. అయితే, ఆయన ప్రయత్నాలను సఫలం కానివ్వబోమని చెప్పారు.

మరో సంచలన వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ చేశారు. తాను ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించనని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని వివరించారు. అయితే.. తాను స్వయంగా సర్వే చేసినప్పుడు సుమారు లక్ష శాంపిళ్లు తీసుకుంటానని తెలిపారు. కానీ, మీడియా సర్వేల్లో ఈ శాంపిల్స్ 5 వేలు నుంచి 6 వేలు.. ఇలా ఉంటాయని వివరించారు. 

Latest Videos

undefined

Also Read: Telangana Elections: మెజార్టీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. గులాబీ శిబిరం ధైర్యం ఇదే

అయితే, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా ఉన్నట్టు తాను చూసినట్టు డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో అంచనా వేసిన నెంబర్లే నిజం అవుతాయని అనుకుంటున్నట్టు చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో హోరాహోరీగా ఉన్నందున మళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్ రాజకీయం చేస్తారా? అని అడగ్గా.. రిసార్ట్ రాజకీయాలు అని మాట్లాడుతున్నవారికి విషయం సరిగా అర్థమైనట్టు లేదని డీకే శివకుమార్ అన్నారు. ఇది వట్టి వదంతి మాత్రమేనని చెప్పారు. తమ ఎమ్మెల్యేలపై తమకు నమ్మకం ఉన్నదని, వారు పార్టీకి విధేయులు అని తెలిపారు.  వారు గతంలోనే ఆపరేషన్ లోటస్ చూసి ఉన్నారని వివరించారు. ఈసారి అలాంటి ఆపరేషన్ సక్సెస్ కాబోదని నమ్మకంగా చెప్పారు.

Also Read: CM KCR: కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చినా 4న కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించవచ్చునా?

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చేసుకుని దాదాపు పండుగ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో డీకే శివకుమార్ తనకు ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకాలు లేవని చెప్పడం గమనార్హం.

click me!