తెలంగాణ క్యాబినెట్ కూర్పు పై అధిష్టానం దృష్టి సారించింది. ప్రాంతం, సామాజిక వర్గం, సీనియారిటీ, విధేయత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో బెర్తులను కన్ఫామ్ చేయనుంది. ఇందుకు సంబంధించి కొన్ని అంచనాలను చూద్దాం.
హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అదిష్టానం బిజీగా ఉన్నది. సీఎం సీటు కోసం రేసు సాగినా.. చివరకు రేవంత్ రెడ్డినే అధిష్టానం ఎంచుకుంది. భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా ఎంచుకునే అవకాశం ఉన్నది. ఓ బలమైన బీసీ నేతను కూడా డిప్యూటీ సీఎంగా నిర్ణయించే అవకాశం ఉన్నది. ఈ ఎన్నికల్లో బీసీ నినాదం, వీరిని ఆకర్షించే ప్రయత్నాలు బాగా జరిగాయి. కాబట్టి, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీసీలను దూరం పెట్టే సాహసం చేయకపోవచ్చు. లేనిపక్షంలో దళిత లేదా గిరిజన లీడర్‌నూ ఈ పదవికి ఎంచుకునే అవకాశాలు లేకపోవు.
సాధారణంగా క్యాబినెట్ కూర్పులో బయటకు కనిపించే కొన్ని మౌలిక విషయాలు చర్చిద్దాం. ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక్క ఎమ్మెల్యేనైనా మంత్రిగా తీసుకోవడం, అన్ని కులాలకు న్యాయం చేసేలా ఉండటం, సీనియర్లు, పార్టీకి విధేయులనూ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే అవకాశం ఉన్నది. అయితే, కాంగ్రెస్ సీట్లు అత్యధికంగా గెలుచుకున్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మంత్రి పదవికి పోటీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. బెర్తుల కూడా ఈ జిల్లాల నేతలకే అధికంగా కేటాయించే అవకాశాలూ ఉన్నాయి.
undefined
Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డి జర్నలిస్టు అవతారం.. అసలు ఆ పత్రికలో ఎందుకు చేరాడు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ కుమార్ రెడ్డిలు ఈ రేసులో ఉన్నారు. వీరిలో ఇద్దరికి బెర్త్ కన్ఫామ్ అనే ప్రచారం ఉన్నది. ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావులూ ఈ పోటీలో ఉన్నారు. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా పరిశీలిస్తే.. ముగ్గురూ మూడు భిన్న సామాజిక వర్గాలకు చెందినవారు. కాబట్టి, వీరిని క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కూడా కలుపుకుంటే నలుగురు రెడ్డి నేతలు క్యాబినెట్‌లో ఉంటారు. కాబట్టి, ఇతర సామాజిక వర్గాల నేతలనూ సర్దుబాటు చేసే అవకాశాలు ఉంటాయి. కరీంనగర్ నుంచి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబును, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : Telangana Cabinet: డిప్యూటీ సీఎంగా పొన్నం ప్రభాకర్? అందుకోసమేనా?
వరంగల్ నుంచి సీతక్కను, కొండా సురేఖను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గిరిజన వర్గం నుంచి సీతక్కను, బీసీ నేతగా కొండా సురేఖను ఎంపిక చేసుకోవచ్చు. సీతక్కను హోం మంత్రి చేస్తారనే చర్చ జరుగుతున్నది. మరికొందరు ఆమెకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఇస్తారని, కాదు కాదు.. ఆమెకు అటవీ శాఖ కేటాయించాలనే చర్చలు కూడా చేస్తున్నారు. చెన్నూర్ నుంచి గెలిచిన గడ్డం వివేక్‌కూ కూడా దళిత సామాజిక వర్గానికి ప్రతినిధిగా, కాకా వారసుడిగా ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నాయి. మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లిని పాలకుర్తి నుంచి చిన్నవయసులో ఓడించిన యశస్విని రెడ్డి గురించీ ఆలోచించవచ్చు.
Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!
నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీని తీసుకోవాల్సింది. కానీ, కామారెడ్డిని రేవంత్ రెడ్డికి అప్పగించి నిజామాబాద్ అర్బన్‌లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. మైనార్టీ నేతగా ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అలాగే.. హైదరాబాద్ నుంచి కూడా మరో మైనార్టీ నేతను ఈ రీతిలో తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు, అవసరమైతే తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడుకోవడానికి, రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చిన ప్రొఫెసర్ కోదండరాంను కూడా క్యాబినెట్‌లోకి తీసుకోవచ్చు.