Telangana Cabinet: డిప్యూటీ సీఎంగా పొన్నం ప్రభాకర్? అందుకోసమేనా?

By Mahesh KFirst Published Dec 6, 2023, 12:12 AM IST
Highlights

పొన్నం ప్రభాకర్‌ డిప్యూటీ సీఎం అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బలమైన బీసీ సామాజిక వర్గం నేపథ్యం ఉన్న పొన్నం ప్రభాకర్‌.. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతగా ఉండబోతున్నట్టు సమాచారం. క్యాస్ట్ ఈక్వేషన్, జిల్లాను పరిగణనలోకి తీసుకుని అదిష్టానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
 

హైదరాబాద్: రేవంత్ రెడ్డి సీఎంగా కన్ఫామ్ అయ్యాక అధిష్టానం మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక పేర్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని చెబుతున్నారు. 

పొన్నం ప్రభాకర్ నిఖార్సైన కాంగ్రెస్‌వాదీ. విద్యార్థి రాజకీయాల నుంచి ఇప్పటికీ హస్తం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. 2009 నుంచి 2014లో ఆయన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అతిపిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. 

పొన్నం ప్రభాకర్ గౌడ సామాజికవర్గానికి చెందిన మాస్ లీడర్. బలమైన ప్రజా సంబంధాలు కలిగిన నాయకుడు. ఆయన పదవుల్లో లేకున్నా ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఫలితాలను ప్రభావితం చేయగల సామాజిక వర్గాల్లో బీసీలు ముందు ఉంటారు. అందులో బీసీలో గౌడ సామాజికవర్గం కూడా కీలకమైంది.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డి జర్నలిస్టు అవతారం.. అసలు ఆ పత్రికలో ఎందుకు చేరాడు?

తెలంగాణలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదని బీఆర్ఎస్ పై వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది వరకే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పినందుకు చివరి వరకు కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ క్యాబినెట్ కూర్పులో అన్ని ఈక్వేషన్లు సరిపోయేలా నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసమే బీసీకి కీలక బాధ్యతను ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే బలమైన బీసీ నేత అయిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. పొన్నం ప్రభాకర్‌కు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇప్పటికే చర్చ జోరుగా నడుస్తున్నది. అదే విధంగా కొండా సురేఖ కూడా బలమైన బీసీ నాయకురాలిగా ఉన్నారు. ఆమెను మంత్రిగా తీసుకునే అవకాశాలున్నాయి.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!

సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక జరిగిన తర్వాత ఇప్పుడు క్యాబినెట్ కూర్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నది. దీనిపై బుధవారం అధిష్టానం సంప్రదింపులు, చర్చలు జరిపే అవకాశం ఉన్నది. ఆ తర్వాతే దీనిపై నిర్ణయం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 7వ తేదీన మాత్రం సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పిన కాంగ్రెస్.. మరి డిప్యూటీ సీఎంలు, ఎంత మంది మంత్రులు ప్రమాణం తీసుకుంటారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

click me!