telangana election 2023 : రేపు సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు : తెలంగాణ సీఈవో వికాస్ రాజ్

Siva Kodati |  
Published : Nov 29, 2023, 06:01 PM IST
telangana election 2023 : రేపు సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు : తెలంగాణ సీఈవో వికాస్ రాజ్

సారాంశం

ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి పోలింగ్ రోజున సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. అన్ని కంపెనీలు సెలవు ప్రకటించిందో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఎన్నికల సంఘం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కంపెనీలు మాత్రం సెలవు ఇవ్వని విషయం ఈసీ దృష్టికి వచ్చింది. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. 

గతంలో జరిగిన ఎన్నికల్లో అంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly polls 2018), 2019 లోక్ సభ ఎన్నికల (lok sabha polls 2019) సమయంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు అన్ని కంపెనీలు సెలవు ప్రకటించిందో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. ఓటింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

కాగా.. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలువులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (telangana government) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ ఉద్యోగులు, కార్మికులందరికీ నవంబర్ 30వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీన జరగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడికానున్నాయి. 

ALso Read: telangana election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం.. అన్ని రకాల ప్రచారాలపై నిషేధం : సీఈవో వికాస్ రాజ్

మాక్ పోల్ కోసం గురువారం ఉదయం 5.30 కల్లా పోలింగ్ ఏజెంట్లు రావాలని.. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోకూడదని ఆయన పేర్కొన్నారు. తొలిసారి హోం ఓటింగ్ చేశామని.. 27 వేల 178 మంది హోం ఓటింగ్ వినియోగించుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో వున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని.. 27,097 పోలింగ్ స్టేషన్‌లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. 

119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారని వికాస్ రాజ్ చెప్పారు. ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ వున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు వున్నారని.. వారిలో కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు, కోటి 62 లక్షల 92 వేల 418 మంది పురుష ఓటర్లు వున్నారని వికాస్ రాజ్ తెలిపారు. అలాగే 2,676 మంది ట్రాన్స్‌జెండర్లు వున్నారని.. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

12 వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. 9 లక్షల 99 వేల 667 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వికాస్ రాజ్ చెప్పారు. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదని ఆయన ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదని తెలిపారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్దమని.. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధమన్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు