telangana election 2023 : కొద్దిగంటల్లో పోలింగ్.. ఇంకా అందనీ ఓటరు స్లిప్పులు, హైదరాబాద్‌లో దుస్ధితి ఇది

Siva Kodati |  
Published : Nov 29, 2023, 04:27 PM IST
telangana election 2023 : కొద్దిగంటల్లో పోలింగ్.. ఇంకా అందనీ ఓటరు స్లిప్పులు, హైదరాబాద్‌లో దుస్ధితి ఇది

సారాంశం

పోలింగ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే వుండగా మంగళవారం వరకు హైదరాబాద్‌లోని వివిధ డివిజన్ల పరిధిలోని ఓటర్లకు ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదు. అయితే స్లిప్పులు లేకపోవడంతో చాలా మంది ఓటింగ్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 

మరికొద్దిగంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది . ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పంపిణీ కేంద్రాలకు చేరుకుని, తమ సామాగ్రిని తీసుకుంటున్నారు. మరోవైపు.. పోలింగ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే వుండగా మంగళవారం వరకు హైదరాబాద్‌లోని వివిధ డివిజన్ల పరిధిలోని ఓటర్లకు ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదు.

నవంబర్ 15న ఇంటింటికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ నగరంలోని అన్ని డివిజన్‌లకు చెందిన మెజారిటీ ఓటర్లు తమకు ఇంకా ఓటరు  స్లిప్పులు అందలేదని చెబుతున్నారు. కొందరు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లుగా తెలిపారు. అయితే స్లిప్పులు లేకపోవడంతో చాలా మంది ఓటింగ్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 

ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్ అందేలా ఎన్నికల అధికారులు ఎలాంటి చొరవ తీసుకోకపోవడంతో ఓటింగ్ శాతంపై పెను ప్రభావం పడుతుందని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ .. ఎన్నికల అధికారులు ఓటు వేయాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కానీ స్లిప్పులు పంపిణీ చేయడంలో విఫలమయ్యారని సొహైల్ దుయ్యబట్టారు. 

అయితే ఓటు వేయడానికి ఓటర్ స్లిప్‌లు తప్పనిసరి కాదని కానీ.. ఇప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్లిప్పులను కలిగి ఉండాలనే అవగాహన కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఏదైనా గుర్తింపు పత్రాలతో ఓటు వేయొచ్చని సొహైల్ సూచించారు. 60 శాతం మందికి ఓటరు స్లిప్పులు ఇంకా అందలేదని ఆసిఫ్ ఆరోపించారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు భరోసా కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. BLOలు వారి సంబంధిత ప్రాంతాల్లోని ఓటర్లందరికీ సమాచార స్లిప్‌లను పంపిణీ చేయలేకపోయారని సొహైల్ ఆరోపించారు. 

చాలా మంది స్లిప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యావంతులు వివిధ మోడ్‌లను ఉపయోగించి ఓటర్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోగలిగారని.. మరి నిరక్ష్యరాస్యుల పరిస్ధితి ఏంటని సొహైల్ ప్రశ్నించారు. ఓటరు స్లిప్పులను పొందడానికి వారు ఎలాంటి అదనపు ప్రయత్నం చేయరని చెప్పారు. ఓటరు స్లిప్పులు అందకపోతే వారు ఓటు వేయడానికి వెళ్లరని సొహైల్ తేల్చేశారు. దాదాపు 50 ఇళ్లలో ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయలేదని నాంపల్లి వాసులు వాపోయారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు