విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రత్యర్థి పార్టీలకు ఎలా నష్టం? హస్తం పార్టీకి ఎలా కలిసి రానుంది. బీఆర్ఎస్, బీజేపీలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అంతిమంగా కాంగ్రెస్‌కు కలిసి వస్తాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ మేనేజ్ చేసుకుంటుందా?
హైదరాబాద్: ఎన్నికల వేళ పార్టీలు మారడం కామన్. కానీ, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలు మారడం వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఉండే ఉంటుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు హామీ పై విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ అవకాశం కోసం అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ పీక్స్‌లో ఉన్నప్పుడు మారడం వెనుక మరో మతలబు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరితే హస్తం పార్టీకి వచ్చే ప్రయోజనాలు ఏమిటీ? బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి వాటిల్లే నష్టం ఏమిటీ?
ఈ ఎన్నికల సీజన్‌లో చాలా మంది నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు మారారు. కానీ, ఈ రెండు పార్టీల నుంచి బీజేపీలోకి చేరలేదు. బీజేపీ నుంచే ఇతర పార్టీలోకి మారారు. ఇది బీజేపీ పరిస్థితిని సూచిస్తున్నది. ఈ ట్రెండ్‌ను విజయశాంతి చేరిక మరోసారి స్పష్టం చేసింది. బీజేపీ గట్టి పోటీ ఇవ్వట్లేదనే సంకేతాలను ఇస్తున్నది. ఇది బీజేపీకి నష్టం.
undefined
కానీ, కాంగ్రెస్‌కు కలిసివచ్చేది.. బీఆర్ఎస్‌ను నష్టపెట్టే అంశం కూడా ఒకటి ఉన్నది. తెలంగాణలో మొదటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తరుచూ ఎదుటి రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాయని ఆరోపించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదనే ఆరోపణ బలంగా వచ్చింది. కేసీఆర్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసే కేంద్రం పెద్దలు అటు వైపుగా చర్యలు తీసుకోవడానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు వ్యవహారం యూటర్న్ తీసుకున్నది. ఇవి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఒక అండస్టాండింగ్ ఉన్నదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటున్నది. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, తమకే అధికారం ఇవ్వాలని కాంగ్రెస్ పదేపదే చెబుతున్నది.
Also Read: RBI: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకిటరమణన్ కన్నుమూత.. 1990ల సంక్షోభ, సంస్కరణల సమయంలో బాధ్యతలు
ఈ ఆరోపణను ట్యాకిల్ చేయడానికి కేసీఆర్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తోనూ తమకు సంబంధం లేదని సంకేతాలు ఇచ్చేలా కేంద్రంలో వచ్చేది సంకీర్ణమేనని, అసలు భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదేనని అన్నారు. తద్వార జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే బీఆర్ఎస్‌కు బీజేపీ కూడా ప్రత్యర్థే అని చెప్పాలని ప్రయత్నించారు. సంకీర్ణ ప్రభుత్వం అనే కామెంట్ చర్చనీయాంశమైంది. కానీ, కేసీఆర్ చేసిన ఈ వ్యూహాత్మక వ్యాఖ్యను విజయశాంతి చేరిక నీరుగారుస్తున్నది.
నిన్నా మొన్నటి వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న విజయశాంతి ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య తెరవెనుక అండస్టాండింగ్ ఉన్నదని విలేకరులకు చెప్పారు. వారి మధ్య ఒప్పందం ఉన్నదని, తెలంగాణ ఉద్యమకారణిగా రాష్ట్రంలో జరిగిన అవినీతిపై బీజేపీ అధినాయకత్వం చర్యలు తీసుకోకపోవడం బాధకలిగించే పార్టీ మారుతున్నట్టు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉన్నదని స్పష్టంగా చెబుతూ.. బీజేపీలోనూ కేసీఆర్ మనుషులు ఉన్నారని, ఇప్పుడు బీజేపీ అధిష్టానం పార్టీని కేసీఆర్ ముందు మోకరింపజేసిందని కామెంట్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మకంగా కలిసి రానుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోవడానికి కీలకంగా ఉపకరించనుంది.