KCR: కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్? నాలుగు నెలలు గడ్డుకాలమే!

By Mahesh KFirst Published Dec 4, 2023, 10:18 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ సవాల్ విసిరారా? లేక నిజంగానే సహకరిద్దామని అన్నారా? నాలుగు నెలలు ఆగుదాం అనే మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నది. ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సి ఉన్నది. ఈ కాలంలోనే లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయి. దీంతో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా.. తామే ఆదర్శం అని, తమకే ఓట్లు వేయాలని లోక్ సభలో క్యాంపెయిన్ చేసే స్థితిలో కాంగ్రెస్ ఉండటం హస్తం పార్టీ అదిష్టానానికి చాలా అవసరం.
 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫార్ములా ఫాలో అవుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ గ్యారంటీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించింది. సీఎం సీటుపై తర్జనభర్జనలు చేస్తున్నది. ఈ సందర్భంలో ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. ప్రభుత్వానికి సహకరించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు సూచనలు ఇస్తూనే ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. నాలుగు నెలలు ఆగుదామని, ఆ తర్వాత కార్యచరణ అమలు చేద్దామని చెప్పారు. ఈ నాలుగు నెలల కాలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలంగానే ఉండనుంది.

ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తొలుత నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కొంత సమయం ఇచ్చిందనే పాజిటివ్ యాంగిల్‌లోనూ ఈ కామెంట్ తీసుకోవచ్చు. అయితే, లోక్ సభ ఎన్నికలు, ఆరు గ్యారంటీలకు విధించిన 100 రోజుల గడువు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇది గడ్డు కాలమే. అందుకే కేసీఆర్ ఇచ్చిన ఈ నాలుగు నెలల గడువు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమే అని అర్థం అవుతున్నది.

Also Read : KCR: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్

మహాలక్ష్మీ స్కీం కింద నెలకు ప్రతి మహిళకు రూ. 2,500, బస్సులో ఉచిత ప్రయాణం తొలి గ్యారంటీగా కాంగ్రెస్ ప్రకటించింది. రూ. 500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. గృహ జ్యోతి కింద 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని, యువకులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం, కోచింగ్ ఫీజు తామే భరిస్తామని గ్యారంటీ ఇచ్చింది.

Also Read: KTR: శాసన సభలో తొలిసారి ప్రతిపక్షంలో బీఆర్ఎస్.. విపక్ష నేతగా ఎవరు?

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అధికారంలో వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వచ్చీరాగానే సొంతంగా ప్రకటించిన భారీ హామీల చిట్టను అమలు చేయాల్సి ఉన్నది. మరో మూడు నాలుగు నెలల్లో రాబోతున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ కాంగ్రెస్ తన దూకుడును కొనసాగించాలంటే వాటిని అమలు చేయకతప్పని పరిస్థితి. 24 గంటల ఉచిత కరెంట్, రైతు భరోసా, చౌకగా గ్యాస్ సిలిండర్‌లు వంటివి వెంటనే అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా తొలి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పింది. వీటన్నింటినీ అమలు చేయడం నిజంగానే కాంగ్రెస్‌కు కత్తిమీద సాము. రాష్ట్ర ఆదాయ, వ్యయాలు, ఆర్థిక స్థితిగతులను వెంటనే ఆకళింపు చేసుకుని వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దగ్గరగా చూసిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను సులువుగా ఇరుకునపెట్టేయొచ్చు.

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఓ కన్నేసి ఉంచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మూడు పోటాపోటీగా బరిలో ఉండే అవకాశం ఉన్నది. ఇంతలోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పిదాలేమైనా ఉంటే అది హస్తం పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంటుంది.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా గెలిచింది!!

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్య సాధారణమైనదిగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం నాలుగు నెలలు సవాళ్లతో కూడుకున్న కాలమే.

click me!