KTR: శాసన సభలో తొలిసారి ప్రతిపక్షంలో బీఆర్ఎస్.. విపక్ష నేతగా ఎవరు?

By Mahesh K  |  First Published Dec 4, 2023, 8:25 PM IST

శాసన సభలో తొలిసారిగా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండనుంది. సాధారణంగా పార్టీ సారథి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారు. కానీ, కేసీఆర్ ఎల్పీ నేతగా ఉండకపోవచ్చనే చర్చ జరుగుతున్నది. కేటీఆర్ లేదా హరీశ్ రావును ఎల్పీ నేతగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, దళిత, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనూ ఎల్పీ నేతగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి.
 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్నది. మెజార్టీకి ఆమడ దూరంలో నిలిచిన బీఆర్ఎస్ తదుపరి బాధ్యతల్లో మునిగింది. ఈ రోజు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఓ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తప్పిదాలు, కారణాలపై చర్చించినట్టు సమాచారం. దీనితోపాటు అసెంబ్లీలో నిర్వహించాల్సిన ప్రతిపక్ష పాత్ర పైనా చర్చ జరగినట్టు సమాచారం. 

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తొలిసారిగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తున్నది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను, ప్రభుత్వాన్ని కేసీఆర్ విజయవంతంగా లీడ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్‌తో మ్యాచ్ అయ్యే లీడర్ లేడని బీఆర్ఎస్ నేతలు పలుమార్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో ఉన్నది. దీంతో అసెంబ్లీలో ఎల్పీ నేతగా ఎవరు ఉంటారు? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 

Latest Videos

undefined

Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా గెలిచింది!!

కేసీఆర్‌ను దగ్గరగా గమనించినవాళ్లు కూడా.. శాసన సభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఆసక్తి చూపించకపోవచ్చునని చెబుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడూ కేసీఆర్‌కు, ఆయనకు మధ్య వేడిగా, వాడిగా వాదనలు జరిగాయి. దీంతో కేసీఆర్ బహుశా శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఆయనకు బదులు కేటీఆర్ లేదా హరీశ్ రావును నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!

అయితే, తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాత్రం ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎల్పీ నేతగా కేటీఆర్ ఉండాలని కోరినట్టు తెలిసింది. అలాగైతేనే.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ, ఇతర ఎన్నికల్లో బీఆర్ఎస్ ఢీలా పడకుండా ఉండాలంటే కేటీఆర్ శాసన సభలో ప్రధాన పాత్ర పోషించాలని సూచించినట్టు సమాచారం. మరి కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల సూచనలను అంగీకరిస్తారా? లేదా? అనేది స్పష్టం కావాల్సి ఉన్నది.

Also Read : Telangana CM: సీఎం ఎంపిక ఇవ్వాళ లేనట్టే?.. భిన్నాభిప్రాయాలా? డిసెంబర్ 9 దాకా వెయిటింగా?

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం కుర్చీపై కూర్చుంటారని, కేసీఆర్ మదిలో అదే ఆలోచన ఉన్నదని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నేతల్లోనూ ఈ అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి కేటీఆర్ లేదా హరీశ్ రావుకు బదులు మరో నేతను ఎల్పీ నేతగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ లేదా దళిత నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆరోపణలకూ చెక్ పెట్టడానికి ఈ సామాజిక వర్గానికి చెందిన నేతనూ శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. శాసన సభ కొలువుదీరేలోపు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

click me!